అప్పులే ప్రాణం తీశాయి | - | Sakshi
Sakshi News home page

అప్పులే ప్రాణం తీశాయి

Jul 13 2026 1:28 AM | Updated on Jul 13 2026 1:28 AM

అప్పులు తీర్చే దారి లేక శనివారం రాత్రి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకరు వ్యవసాయం, కొడుకు ఉపాధి కోసం అప్పులు చేయగా.. మరొకరు పిల్లలను చదివించలేక, చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణం పొందారు. ఈ ఇద్దరు కూడా ముస్తాబాద్‌ మండలానికి చెందినవారే.

ముస్తాబాద్‌(సిరిసిల్ల): తనకున్న రెండెకరాల్లో బోర్లు వేసినా నీరు రాక వ్యవసాయం సాగలేదు. ఒక్కాగానొక్క కొడుకును ఉపాధి కోసం దుబాయ్‌కి పంపినా ఆదాయం రాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై జ్యోతి కథనం ప్రకారం.. ముస్తాబాద్‌ మండలం పోతుగల్‌కు చెందిన ఈరవేణి పర్శరాములు(42) తనకున్న రెండెకరాల్లో వరి పంట వేశాడు. అప్పులు చేసి బోర్లు వేయించినా నీరు పడలేదు. కుమారుడు తేజను కువైట్‌ దేశానికి పంపించాడు. 4 నెలల క్రితం తేజ కువైట్‌లో సరైన పని లేదని స్వగ్రామానికి వచ్చాడు. వ్యవసాయానికి, కుమారుడిని కువైట్‌కు పంపేందుకు రూ.13లక్షల వరకు చేసిన అప్పులు ఎలా తీర్చేదంటూ పర్శరాములు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించక ఇంట్లో అందరూ నిద్రించిన తర్వాత శనివారం రాత్రి దూలానికి చీరతో ఉరేసుకున్నాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులు తాళలేక..

కుమారులకు ఉన్నత చదువులు చెప్పించలేక.. చేసిన అప్పులు తీర్చలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై జ్యోతి కథనం మేరకు.. ముస్తాబాద్‌ మండలం ఆవునూర్‌కు చెందిన బండి లావణ్య(38) భర్త రవి ఉపాధి కోసం మూడేళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లాడు. ఆయనకు సరైన జీతం లేక ఇంటికి డబ్బులు పంపించడం లేదు. రవి దుబాయ్‌కి వెళ్లేందుకు అప్పులు చేశాడు. మరోవైపు ఇద్దరు కుమారులు వికాస్‌, వినయ్‌ చదువులకు లావణ్య ఇబ్బందులు పడుతోంది. బీడీలు చేస్తూ పిల్లలను పోషిస్తోంది. వినయ్‌ ఉన్నత చదువులకు డబ్బులు అవసరం కాగా.. అవి సమకూరలేదు. రూ.5లక్షల అప్పులు ఎలా తీర్చేదని లావణ్య తీవ్ర మానసిక వేదనకు గురై శనివారం రాత్రి ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు వికాస్‌ను బయటకు పంపింది. చీరతో దూలానికి ఉరేసుకుంది. వికాస్‌ ఎంత అరిచినా తలుపులు తీయలేదు. కళ్లేదుటే తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో వికాస్‌ రోదనలు మిన్నంటాయి. భార్య కడసారి చూపునకు కూడా రవి దుబాయ్‌ నుంచి రాలేకపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

ముస్తాబాద్‌ మండలంలో ఇద్దరి బలవన్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement