సిరిసిల్లటౌన్: గానకోకిల.. మధురగాయని జానకమ్మ బాల్యం సిరిసిల్లలోనే గడిపారు. ఇక్కడ గడిపిన క్షణాలను ఆమె పలు సందర్భాలలో ప్రస్తావించారు. శ్రీశాల క్షేత్ర వేంకటేశ్వరస్వామి ఆలయం.. ఉదరవాగు నుంచి నీళ్లు తెచ్చుకోవడం.. వేములవాడకు ఎడ్లబండిలో వెళ్లి బాలనాగమ్మ సినిమా చూసిరావడం.. ఆ సినిమాలోని పాటలను చుట్టుపక్కల ఇళ్లల్లో పాడిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. జానకమ్మ మరణంతో సిరిసిల్ల ప్రజలు మధురగాయని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు. బాల్యంలో ఆమెతో కలిసి పెరిగిన వారు అప్పటి విషయాలు చర్చించుకుంటున్నారు.
తిమ్మయ్య గారి బంగ్లాలో..
జానకమ్మ తండ్రి శ్రీరామమూర్తి వృత్తిరీత్య ఆయుర్వేద వైద్యుడు. వీరి కుటుంబం దాదాపు ఆరేళ్లు సిరిసిల్లలోనే ఉన్నారు. అప్పుడు తిమ్మయ్యగారి బంగ్లాలో ఉండేవారు. బాల్యంలో మానేరు తీరాన ఆటపాటలు, అప్పట్లో ఇక్కడ చూసిన ఓ సర్కస్ గురించి పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. మానేరు నది ఉపకాల్వ ఉదరవాగు నుంచి తమ ఇంటికి మంచినీరు తీసుకెళ్లిన గుర్తులను ఆమెతో పెరిగిన సహచరులు గుర్తుకు తెచ్చుకున్నారు. శ్రీసిరిసిల్లలో గడిపిన ఆ రోజులు నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనవ్ఙి అని జానకమ్మ ఎప్పుడూ చెబుతుండేవారు.
సిరి వెలుగుల ఆత్మీయ సత్కారం
2001లో సిరిసిల్లలో నిర్వహించిన సిరి వెలుగుల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా స్థానిక సాహితీవేత్తలు, అభిమానులు జానకమ్మను సత్కరించుకున్నారు. ఆ సమయంలో జానకమ్మ ఇక్కడి ప్రజల ఆత్మీయతకు కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పట్లో సిరిసిల్ల ప్రాంతంలో రైతాంగ పోరాటాలు ఉధృతంగా సాగడంతో కుటుంబ పరిస్థితుల రీత్యా వారి కుటుంబం మద్రాసు(చైన్నె) తరలి వెళ్లాల్సి వచ్చింది. ఆమె కుటుంబం నివసించిన అద్దె ఇల్లు తిమ్మయ్యగారి బంగ్లా ప్రస్తుతం ప్రముఖ వ్యాపారి గరిపెల్లి ప్రభాకర్ ఖాళీ స్థలంలో ఉండేదని చరిత్రకారులు తెలిపారు. వేంకటేశ్వరస్వామి ఆలయం పక్కనే ఉండడంతో చిన్నప్పటి నుంచి శ్రీవారి పాటలు పాడేవారని పేర్కొన్నారు. గాయనిగా కీర్తిప్రతిష్ఠలు పొందిన జానకమ్మ సిరిసిల్లలోనే స్వరాలాపనలో తొలి అడుగులు పడ్డాయని ఇక్కడి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
సిరిసిల్లలోనే తొలి స్వరాలాపన
పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావన


