మెట్‌పల్లి: సహజీవనం ఓ మహిళ ప్రాణాలు తీసింది. ఓ వ్యక్తితో కలిసి ఉన్న ఆమెను అతడి కళ్ల ముందే దారుణంగా హత్య చేశారు. ఈ ఘాతుకానికి అతడి కుటుంబ సభ్యులే పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు.. చింతలపేటకు చెందిన కర్రె సునీత(34)కు వివాహమై ఇద్దరు కుమారులున్నారు. కొంతకాలం క్రితం ఆమె భర్త మరణించాడు. ఆ తర్వాత కోరుట్లకు చెందిన గంగారెడ్డి అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది. దీనికి అభ్యంతరం తెలుపుతూ వస్తున్న గంగారెడ్డి కుటుంబ సభ్యులు పది రోజుల క్రితం సునీతపై దాడికి దిగినట్లు తెలిసింది. ఈ దాడిలో ఆమె ఎడమ చేతికి తీవ్ర గాయమైంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇరువురు మెట్‌పల్లిలోని శాంతినగర్‌కు వచ్చి నివాసముంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం గంగారెడ్డి, సునీత ఇంట్లో ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆమె మెడపై పదునైన ఆయుధంతో దాడి చేశారు. అడ్డుకోబోయిన గంగారెడ్డిపైనా దాడికి యత్నించారు. అనంతరం ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలతో సునీత అక్కడికక్కడే మృతిచెందగా.. గంగారెడ్డి చేతికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారమందుకున్న జగిత్యాల డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, సీఐ సురేశ్‌బాబు, ఎస్‌ఐ కిరణ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. తన తండ్రితో సహజీవనం వద్దని చెప్పినా సునీత పట్టించుకోకపోవడంతోనే గంగారెడ్డి కొడుకు తన స్నేహితుడితో కలిసి హత్య చేసినట్లు తెలిసింది. పట్టపగలే జరిగిన ఈ ఘటనతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు.
కలిసి ఉంటున్న వ్యక్తి కళ్లెదుటే మహిళ దారుణ హత్య


