వెల్గటూర్: ఉరేసుకుని ఓ యువకుడు బలవన్మరణా నికి పాల్పడిన ఘటన మండలంలోని మొక్కట్రా వుపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకా రం.. గ్రామానికి చెందిన మేకల గణేష్ (25) వారం క్రితం తన భార్యతో కలిసి హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ పని దొరక్కపోవడంతో శనివారం వేకువజామున ఇంటికి వచ్చారు. గణేశ్ తన భార్యతో గొడవపడి పుట్టింటికి పంపించాడు. తల్లి పని నిమిత్తం బయటకు వెళ్లింది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోనే ఉరేసుకున్నాడు. తల్లి మధ్యాహ్నం వచ్చి చూసేసరికి శవమై కనిపించాడు. ఉపాధి లేకనే జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడని గణేశ్ తల్లి శాంతవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జ్ ఎస్సై రవీందర్ తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మల్యాల: ఈనెల ఐదున రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న జగిత్యాలకు చెందిన కావేటి వెంకన్న (46) శనివారం మృతి చెందాడు. ఎస్సై సందీప్ కథనం ప్రకారం.. వెంకన్న కొండగట్టులో ఓ శుభాకార్యం నిమిత్తం వెళ్లి.. తిరిగి వెళ్తుండగా నూకపల్లి వరదకాలువ సమీపంలో బైక్ అదుపు తప్పి.. కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. వెంకన్న తల్లి ఉమామహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
ఐదేళ్ల క్రితం తండ్రి.. ఇప్పుడు తల్లి ..
● అనాథలుగా మారిన చిన్నారులు
హుజూరాబాద్: ఐదేళ్ల క్రితం తండ్రి కేన్సర్‌తో చనిపోగా.. శనివారం తల్లి బావిలో శవమై కనిపించింది. దీంతో ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారగా.. పట్టణంలోని మామిండ్లవాడలో విషాదం నెలకొంది. పోలీసుల వివరాల ప్రకారం.. మామిండ్లవాడకు చెందిన చిందం సునీత(45) భర్త ఐదేళ్లక్రితం గొంతు కేన్సర్‌తో చనిపోయాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు శ్రీలేఖ, శివాని ఉన్నారు. సునీత కొన్నాళ్లుగా పట్టణానికి చెందిన మోతో కిరణ్‌తో సహజీవనం చేస్తోంది. ఇద్దరూ ఎప్పుడూ గొడవ పడుతుండేవారని స్థానికులు తెలిపారు. శుక్రవారం రాత్రి కిరణ్– సునీత కలిసే ఉండగా.. ఉదయం నిద్ర లేచే సమయానికి సునీత కనబడలేదు. స్థానికంగా ఉండే ముత్తోజు భాగ్య శనివారం తన ఇంటి ఆవరణలో ఉన్న చేదబావిలో నీటిని తోడేందుకు బకెట్‌ను వేసింది. మృతదేహం కనిపించటంతో కౌన్సిలర్ భర్త బండ నవీన్‌కు తెలిపింది. ఆయన పోలీస్, అగ్నిమాపక శాఖాధికారులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని బయటకు తీయగా చింత సునీతగా గుర్తించారు. మృతదేహం మెడకు నలుపు రంగు చీరతో ఉరివేసినట్లు ఉంది. సునీత ఆత్మహత్య చేసుకుందా లేక హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సీఐ కరుణాకర్ కేసు నమోదు చేశారు. చిన్నారులు తల్లి మృతదేహం వైపు చూస్తూ ఏడ్చిన తీరు స్థానికులను కన్నీరు పెట్టించింది.
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
పెగడపల్లి: మండలంలోని రాజరాంపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఓ ఇల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన మాదాసు రాజయ్య శనివారం పనుల నిమిత్తం బయటకు వెళ్లాడు. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు లేచి ఇంట్లో ఉన్న దుస్తులు, ఇతరత్రా వస్తువులు, రూ.30 వేలు, స్టడీ సర్టిఫికెట్లు దగ్గమయ్యాయి. గ్రామస్తులు మంటలను ఆర్పివేశారు. మొత్తంగా రూ.3లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ ఇస్లావత్ రమేశ్‌నాయక్, గ్రామస్తులు కోరుతున్నారు.


