ప్లాస్టిక్‌తో కలిగే నష్టాలను వివరిస్తూ వాటిని నిషేధించే దిశగా గ్రామాలు అడుగులేస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని ధర్మారం, పల్లిమక్త గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు పాలకవర్గాలు కృషి చేస్తున్నాయి. గ్రామంలోని దుకాణాదారులకు, వారంవారం జరిగే అంగడిలో అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్‌తో కలిగే నష్టాలు, పేపర్ బ్యాగులతో ప్రయోజనాలను వివరిస్తున్నారు. గ్రామసభలు ఏర్పాటు చేసి పేపర్, జ్యూట్ బ్యాగులు వినియోగించాలని కోరుతున్నారు.
ప్లాస్టిక్ వాడితే రూ.వెయ్యి జరిమానా
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ సర్పంచ్ బంగారి రమేశ్ ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, చిరువ్యాపారులతో ఇటీవల సమావేశాలు నిర్వహించి ప్లాస్టిక్ కవర్లు అమ్మినా, వినియోగించినా రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నట్లు హెచ్చరించారు. ఎవరి ఇంటిముందు ప్లాస్టిక్ వ్యర్థాలు క్నపడినా జరిమానా తప్పదని గ్రామంలో టాంటాం వేయించారు. జూలపల్లి మాజీ జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ గ్రామాల్లో విస్తృతంగా బట్ట సంచుల పంపిణీ చేశారు.
ధర్మారం గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని, వాటి వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పిస్తున్నాం. వారసంతలో అమ్మకందార్లు పేపర్, జ్యూట్ బ్యాగులు వినియోగించాలని కోరుతున్నాం. ఈ నిబంధనలను అతిక్రమించేవారికి జరిమానాలు విధించాలని గ్రామపంచాయతీ తరపున నిర్ణయం తీసుకున్నాం.
– మిర్యాల్‌కార్ బాలాజీ, సర్పంచ్, ధర్మారం


