అమ్మను కరోనా తీసుకెళ్లింది | - | Sakshi
Sakshi News home page

అమ్మను కరోనా తీసుకెళ్లింది

Jul 12 2026 3:17 AM | Updated on Jul 12 2026 3:17 AM

కోల్‌సిటీ: తల్లి మరణంతో కుంగిపోయిన అక్కాచెల్లెళ్లు మహిమ ఐశ్వర్య, కృప మహిమ ఐశ్వర్యను విధి మరోసారి విషాదంలోకి నెట్టింది. కాలం చేసిన గాయం కాలక్రమంలో మానుతుందనుకుంటే రోడ్డు ప్రమాదంలో తండ్రిని కూడా తీసుకెళ్లి అనాథలను చేసింది. తల్లి, తండ్రి మరణంతో దిక్కుతోచక రోదిస్తున్న వారిని చూసి స్థానికులు కంటతడి పెట్టారు. తమ జీవితాల్లో చీకట్లు అలుముకున్నా.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు తండ్రి నేత్రాలను దానం చేసి మానవత్వాన్ని చాటారూ అక్కాచెల్లెళ్లు. మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామానికి చెందిన మునిమందా లక్ష్మణ్‌(45) రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఆయన మృతితో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న మహిమ ఐశ్వర్య, పదో తరగతి చదువుతున్న కృప మహిమ ఐశ్వర్య అనాథలయ్యారు.

బరువెక్కిన ప్రతి హృదయం..

తండ్రి పార్థివదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించిన ఆ ఇద్దరు బిడ్డలు.. అంతిమయాత్రలో శవపేటిక ముందు నడుస్తూ తండ్రికి వీడ్కోలు పలికారు. ఆ దృశ్యం చూసిన ప్రతీఒక్కరి హృదయం బరువెక్కింది.

అండగా నిలిచిన హోంగార్డులు

దుఃఖంతో కుంగిపోయిన ఆ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులూ వెంటాడాయి. నిరుపేద కుటుంబం కావడంతో లక్ష్మణ్‌ అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితి కూడా లేకపోయింది. విషయం తెలుసుకున్న గోదావరిఖనిలోని తోటి హోంగార్డులు ఆర్థిక సాయం చేసి గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిగేలా అండగా నిలిచారు.

విషాదంలోనూ తండ్రి నేత్రాలు దానం

ఇంతటి విషాదంలోనూ ఆ ఇద్దరు కూతుళ్లు సమాజ హితం కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తండ్రి నేత్రాలను దానం చేసి మరో ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముందుకొచ్చారు. వారి నిర్ణయంతో వరంగల్‌ ఎంజీఎంలో ఎల్వీ ప్రసాద్‌ ఐ బ్యాంక్‌ టెక్నీషియన్‌ లక్ష్మణ్‌.. మృతుడి నేత్రాలు సేకరించారు. తమ జీవితాల్లో చీకట్లు అలుముకున్న వేళ మరోఇద్దరి జీవితాల్లో వెలుగు నింపాలన్న వారి కుమార్తెల నిర్ణయం ప్రతీఒక్కరిని కదిలించింది.

నాన్నను ప్రమాదం కబళించింది

అనాథలైన ఇద్దరు కూతుళ్లు

కన్నీరుచూసి బరువెక్కిన ప్రతీగుండె

విషాదంలోనూ తండ్రి నేత్రాలు దానం చేసిన బిడ్డలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement