వర్షమా.. పిడుగా.. | - | Sakshi
Sakshi News home page

వర్షమా.. పిడుగా..

Jun 9 2026 12:12 AM | Updated on Jun 9 2026 12:12 AM

కరీంనగర్‌ అర్బన్‌: పిడుగులు, వర్షం ప్రధానంగా రైతన్నకు తీరని నష్టం. ఎప్పుడు ఎక్కడ పిడుగులు పడతాయో.. వర్షం ఎప్పుడు కురుస్తుందో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో మనుషులు, మూగజీవాలు మరణించిన ఘటనలు అనేకం. ఈ నేపథ్యంలో అన్నదాతలకు అండగా నిలిచేందుకు కేంద్రం యాప్‌లు రూపొందించింది. ఇంటర్‌నెట్‌లో యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు. పిడుగు ఎక్కడ పడుతుంది, వర్షం ఎప్పుడు పడుతుందో ఇట్టే తెలిసిపోతుంది. తదనుగుణంగా రైతన్న వ్యవహరిస్తే చాలు. రైతులతో పాటు ప్రజలకు ఉపయోగపడే మూడు ప్రధాన సమాచార వేదికలను భారత వాతావరణ శాఖ అందుబాటులోకి తెచ్చింది. యాప్‌తో మరో ఐదు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకునే వీలు కల్పించింది.

రెయిన్‌ అలారం

మొబైల్‌ ఫోన్‌లో గూగుల్‌ ప్లే స్టోర్స్‌ నుంచి రెయిన్‌ అలారం అని ఇంగ్లిష్‌లో నమోదు చేస్తే యాప్‌ కనిపిస్తుంది. కేవలం ఒక నిమిషంలో డౌన్‌లోడ్‌ అవుతుంది. వినియోగదారుడు అందించిన వివరాల మేరకు అతను ఉన్న ప్రాంతానికి సమీపంలోని 20 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ వర్షం పడే సూచనలున్నాయని సమగ్ర సమాచారం క్షణాల మీద ఎప్పటికప్పుడు అందిస్తుంది. దీంతో వర్షం ముప్పు తెలుసుకుని ముందే జాగ్రత్తపడే అవకాశం లభిస్తుంది.

దామిని యాప్‌

సాధారణంగా వర్షాకాలంతో పాటు ఏప్రిల్‌, మే నెలల్లో పిడుగులు సహజం. వ్యవసాయ పనుల హడావుడిలో ఉండే రైతులు పిడుగు పడే సమయంలో దగ్గర్లోని ఎత్తైన చెట్ల కిందకో మరో చోటుకే వెళ్తుంటారు. అవి అంత సురక్షితం కావని నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో మరింత సురక్షితంగా ఉండేందుకు రైతులను అప్రమత్తం చేసేదే దామిని యాప్‌. గూగుల్‌ ప్లేస్టోర్స్‌లో దామిని యాప్‌ అని నమోదు చేస్తే కనిపిస్తుంది. దీని ఆధారంగా సమీపంలోని 20 కిలో మీటర్ల దూరంలో 5–20 నిమిషాల్లో ఎక్కడ పిడుగు పడుతుందో అప్రమత్తం చేస్తుంది. దీంతో ఈ వ్యవధిలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.

మేఘాదూత్‌

పంట చేనుకు ఎరువులు అందించాల్సిన సమయంలో లేదా వరికోతల సందర్భంలో రైతులను నష్టపరిచేవి వర్షాలే. రైతులకు నష్టం తప్పించేందుకు భారత వాతావరణ శాఖ ఈ యాప్‌నకు పురుడు పోసింది. గూగుల్‌ ప్లే స్టోర్స్‌ నుంచి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఫోన్‌ ద్వారా అందిస్తుంది. రాబోయే ఐదు రోజుల్లో వాతావరణ మార్పులు, వర్ష సూచనలు సహా ఆకాశం మేఘావృతమవుతుందా లేదా గాలులు ఏ మేరకు ఎక్కడి నుంచి ఎక్కడకు ఏ దిఽశగా వీస్తాయో వివరిస్తుంది.

యాప్‌ ఉంటే అరచేతిలోనే సమాచారం

రైతులకు ఉపయుక్తంగా సేవలు

Advertisement
 
Advertisement
Advertisement