జిల్లాలో..
రైతులివ్వాల్సినవి
కరీంనగర్‌అర్బన్: యాసంగి రైతు భరోసా సాయానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అర్హులైన అన్నదాతల వివరాల నమోదుకు అవకాశం కల్పించింది. క్రయవిక్రయాల క్రమంలో రోజురోజుకు పట్టా దారులు మారుతుండగా మళ్లీ మళ్లీ అవకాశమిస్తోంది. యాసంగి పెట్టుబడి సాయం పొందేందుకు కొత్త పట్టాదారుల దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతి అన్నదాతకు పెట్టుబడి సాయం అందనుంది. ఈ క్రమంలో అలాంటి వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి విచారణ చేసి సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఫిబ్రవరి 28 వరకు పాసుపుస్తకం..
కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం పొందిన రైతులు రైతు భరోసాకు దరఖాస్తు చేయొచ్చు. చాలా మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నప్పటికి ప్రభుత్వం విధించిన గడువులోగా సంబంధిత బ్యాంకు పాసుపుస్తకంతో ఇతర జిరాక్స్ ప్రతులు ఇవ్వకపోవడం వల్ల ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. ఫలితంగా పెట్టుబడి సాయం అందుకోలేకపోయారు. కొంతమంది గ్రామాలలో అందుబాటులో లేకపోవడం వల్ల నమోదు కాలేదు. ఈ క్రమంలో ప్రభుత్వమిచ్చిన అవకాశం వినియోగించుకునేలా వ్యవసాయ శాఖ అవగాహన కల్పిస్తోంది. సమీప రైతు వేదికల్లో నమోదు చేసుకోవాలని సూచిస్తోంది. బ్యాంకు ఖాతాలు, ఇతరత్రా వివరాల్లో మార్పులు, చేర్పులుంటే ఏఈవోల వద్ద సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 25వరకు గడువు కాగా రైతు భరోసాకు నోచుకోని రైతులంతా దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. తదుపరి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాకు చేరనున్నట్లు సమాచారం.
ఆ భూములకు రైతు భరోసా రాదు
గతంలో సాగు భూములు కాకున్నా చాలామంది తమ భూములను వ్యవసాయ భూములుగా చూపగా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన క్షేత్రస్థాయి సాగు భూముల సర్వేలో సాగుకు యోగ్యం కాని భూములను తేల్చారు. జిల్లాలో 76 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో ఏఈవో, రెవెన్యూ అధికారి సంయుక్తంగా సర్వే చేపట్టగా జిల్లాలో 5,608 ఎకరాల భూమి అసలు సాగుకే పనికిరాదని, కొన్ని స్థలాల్లో నాన్‌అగ్రికల్చర్ ల్యాండ్, పలు స్థలాలు రాళ్లు, రప్పలు, గ్రానైట్, క్వారీలు తదితర ఉన్నాయని పేర్కొన్నారు. ఇటుక బట్టీలు, ఫంక్షన్ హాళ్లు, మిల్లులు, రియల్‌ఎస్టేట్ వెంచర్లు, కోళ్ల ఫారాలు, రహదారులు, గోదాములు తదితరాలున్నట్లు గుర్తించారు. రహదారులకు వదిలిన భూమి సదరు రైతు పేరిటనే ఉండడం గమనార్హం. ప్రధాన రహదారులు, కాలువలకు వెళ్లిన భూములు, సర్వేనంబర్లవారీగా రాళ్లూరప్పలున్న భూములు కూడా రైతుల పేరిటే ఉన్నాయి. కాగా పలు ప్రాంతాల్లో భూస్వాములు గతంలో ప్రభుత్వ కార్యాలయాలు, బడులు, ఇతరత్రా వాటికి భూములను దానంగా, ఇనాంగా ఇచ్చారు. కాలక్రమంలో వాటిని మ్యుటేషన్ చేయకపోవడంతో గత ప్రభుత్వం ప్రారంభించిన ధరణి పోర్టల్లో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలున్నా ఆన్లైన్లో మాత్రం ఆ భూములిచ్చిన వారి పేరే నమోదైంది. సర్వేలో గుర్తించిన సాగుకు యోగ్యం కాని భూములకు చెందిన సర్వేనంబర్లతో పాటు విస్తీర్ణం వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు రైతు భరోసా పోర్టల్లో ఫ్రీజింగ్ చేశారు.
మొత్తం గ్రామాలు: 313
ఏఈవో క్లస్టర్లు: 76
సాగు భూమి: 3,39,050 ఎకరాలు
తాజాగా రెవెన్యూ రికార్డుల ప్రకారం
రైతులు: 2,00,075
దరఖాస్తు ఆధార్ కార్డు
బ్యాంకు ఖాతా
పట్టాదారు పాసుపుస్తకం నకలు
మొబైల్ నంబర్


