ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో ఓ వృద్ధుడిని కులపెద్దలు కులం నుంచి బహిష్కరించారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కులపెద్దలతోపాటు తన కోడలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాలు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన కంచర్ల దేవయ్యకు ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు శ్రీనివాస్ ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. పెద్ద కోడలు కంచర్ల లత వృద్ధుడికి భోజనం పెట్టకపోవడంతోపాటు ఇంటి ముందున్న రేకులషెడ్డును తొలగించాలనే విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంపై లత కులస్తులకు ఫిర్యాదు చేసింది. కులపెద్దలైన కంచర్ల రాజు, కంచర్ల శంకర్, కంచర్ల శరబిందు, కంచర్ల మల్లేశం, కంచర్ల నర్సయ్యలు లతకు మద్దతుగా నిలిచారు. వృద్ధుడు దేవయ్యపై దాడిచేయడంతోపాటు అతను ఉంటున్న రేకులషెడ్డును తొలగించారు. ఈక్రమంలోనే దేవయ్యను కులబహిష్కరణకు గురిచేశారు. దేవయ్యతో మాట్లాడిన వారిని కూడ కులబహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆ వృద్ధుడు పోలీసులను ఆశ్రయించగా.. పెద్దమనుషులతోపాటు కోడలు కంచర్ల లతపై బుధవారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
కోడలు, మామ మధ్య వివాదం
వృద్ధుడి రేకులషెడ్డు తొలగింపు
ఐదుగురిపై కేసు


