అందాల వల!
సోషల్ మీడియా వేదికగా వలపు వల
సన్నిహితంగా మెదిలి, వీడియోలు తీసి బెదిరింపులు
చిక్కుకున్న వారి నుంచి రూ.లక్షల్లో వసూలు
తియ్యగా మాట్లాడి ట్రేడింగ్ పేరిట టోకరా
ఇన్‌స్టా, టెలిగ్రాం, డేటింగ్‌యాప్స్‌లో స్నేహం
చిక్కి విలవిల్లాడుతున్న ప్రముఖులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం:
చూసేందుకు అందంగా ఉంటారు. చక్కగా రెడీ అయ్యి ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో రీల్స్ అప్‌లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతారు. లైక్ కొట్టి.. కామెంట్ పెట్టినవారిలో ప్రొఫైల్స్ ఆధారంగా ప్రముఖులు, వ్యాపారులను ఎంచుకుంటారు. తియ్యగా మాట్లాడి స్నేహం చేస్తారు. తెలివిగా తామున్న చోటికి రప్పించుకుంటారు. సన్నిహితంగా మెదిలి, రహస్యంగా కెమెరాల్లో చిత్రీకరిస్తారు. తరువాత స్నేహం ముసుగు తీసి, డబ్బులివ్వాలని బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు. డిమాండ్ చేసినంత ఇవ్వకపోతే వీడియోలు బహిర్గతం చేసి పరువు తీస్తామని బెదిరిస్తారు. కొందరు పరువు పోతుందన్న భయంతో అడిగినంత ఇచ్చుకుని సైలెంట్‌గా తప్పుకుంటుండగా.. మరికొందరు మళ్లీమళ్లీ వారి వలలో చిక్కి విలవిల్లాడుతున్నారు. కొంతకాలంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెలుగుచూస్తున్న హనీట్రాప్ కేసులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
సోషల్ మీడియా వేదికగా
కష్టపడకుండా తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో కొందరు ముఠాగా ఏర్పడి ఇలాంటి పనులు చేస్తున్నారు. అందమైన మహిళలతో సోషల్ మీడియాలో ప్రత్యేక పేజీలు క్రియేట్ చేసి ఆకర్షిస్తారు. వీరి వీడియోలకు కామెంట్లు పెట్టిన వారిని లక్ష్యంగా చేసుకుంటారు. ఒరిజినల్ ఖాతాల నుంచి కామెంట్లు పెట్టిన వారి నేపథ్యాన్ని వెరిఫై చేసుకుంటారు. డబ్బున్న వారైతే డైరెక్ట్ మెసేజ్ చేసి స్నేహం పేరిట ఎరవేస్తారు. కలుద్దామంటూ ఇంటికి ఆహ్వానిస్తారు. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి బెదిరింపులకు దిగి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు.
డేటింగ్‌యాప్స్‌తో జాగ్రత్త
సోషల్ మీడియాతోపాటు డేటింగ్ యాప్స్‌తో చాలా దారుణాలు జరుగుతున్నాయి. కొందరు వివాహేతర సంబంధాలే లక్ష్యంగా ఈ యాప్స్‌లోకి వస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారిని త్వరగా బ్లాక్‌మెయిల్ చేయవచ్చు. స్నేహం చేయడం, కలవడం సులువు. యాప్‌లో చిక్కిన వారిని వీడియోలు తీసి బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. ఇవ్వకపోతే ఏకంగా రేప్ కేసులు పెడుతున్నారు. కేసులకు భయపడి కొందరు, పరువుకు భయపడి మరికొందరు అడిగినంత చెల్లించుకుని అక్కడ నుంచి బయటపడుతున్నారు. ఇలాంటి పద్మవ్యూహాల్లో చిక్కడమే బాధితుల చేతిలో ఉంటుంది. వారిని వదలాలా? వద్దా? అన్నది మాత్రం ముఠా చేతిలోనే ఉంటుంది.


