ఓటర్లు ఎక్కడెక్కడో!
‘డివిజన్ల పునర్విభజన సందర్భంగా నగరంలోని 7వ డివిజన్ పరిధిలోని హౌసింగ్‌బోర్డుకాలనీ, సదాశివపల్లిలో కలిపి 5,207 ఓట్లు ఉన్నాయి. తాజాగా ప్రకటించిన ముసాయిదాలో 7వ డివిజన్ ఓటర్ల సంఖ్య నగరంలోనే అత్యధికంగా 6,846కు చేరింది. కొత్తగా ఓట్లు నమోదు చేయ డం సాధారణమే అయినా, ఏకంగా 1279 ఓట్లు పెరగడం అనుమానాలకు తావిస్తోంది. సీతారాంపూర్, కశ్మీర్‌గడ్డ, షాషామహల్, బొమ్మకల్ ఓట్లు ఈ డివిజన్‌లో భారీగా నమోదయ్యాయి.’
‘నగరంలోని 64వ డివిజన్ ముకరంపురలో స్థానిక ఓట్ల కన్నా, ఇతర డివిజన్ ఓటర్లు అధికంగా ఉన్నారు. వరుస క్రమంలో 400 ఓట్లను పరిశీలిస్తే కనీసం 300 ఓట్లలో తమ డివిజన్‌కు సంబంధం లేనివారు ఉన్నారంటూ స్థానిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2,3 డివి జన్‌లకు సంబంధించిన దాదాపు వేయి ఓట్లు, 28వ డివిజన్‌లో నమోదయ్యాయని స్థానికులు వాపోతున్నారు’.
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ ప్రచురించిన ఓటర్ల ముసాయిదా గందరగోళంగా మారింది. ఇంటినంబర్లతో డివిజన్లవారీగా రూపొందించినట్లు చెబుతున్న ఓటర్ల జాబితాలో వందలాది పేర్లు ఇంటినంబర్లు లేకుండా ఉండడం సందేహాలకు కారణమవుతోంది. డివిజన్ల పునర్విభజన సందర్భంగా ప్రకటించిన ఓట్లసంఖ్యకు తాజా జాబితాకు పొంతనలేకపోవడం, అసాధారణంగా ఓట్లు పెరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాబితాపై అభ్యంతరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కాగా, ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగనుంది.
ఎక్కడెక్కడో
నగరంలో ప్రకటించిన 66 డివిజన్లవారి ఓటర్ల ముసాయిదా జాబితా గందరగోళాన్ని సృష్టిస్తోంది. డివిజన్‌ల పునర్విభజన సందర్భంగా ఇంటినంబర్ల వారిగా ఓటర్ల వివరాలు, అసెంబ్లీ నియోజకవర్గ వారిగా ఓటర్ల జాబితా వివరాల ఆధారంగా డివిజన్ల ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందించారు. ఇంటినంబర్లను పరిశీలించి, సంబంధిత డివిజన్‌లో పొందపరిచినట్లు చెబుతున్నప్పటికి, చాలా మంది ఓటర్లకు సంబంధించి ఇంటినంబర్లు లేకపోవడంతో ఎలా డివిజన్‌కు కేటాయించారనేది తెలియడం లేదు. అసలు ఆ ఓటర్లు తమ డివిజన్‌కు సంబంధించిన వాళ్లే కాదంటూ ఆయా డివిజన్ల సీనియర్ నాయకులు చెబుతున్నారు. అసెంబ్లీ ఓటరు జాబితాలోని పోలింగ్ బూత్‌ల వారిగా ఓటర్లను ఆయా డివిజన్లలో చేర్చినట్లు అధికారులు అంటున్నారు. ఉన్న ఓట్లను తొలగించే అధికారం లేకపోవడంతో, ఓట్లను అన్ని డివిజన్లలో సర్దుబాటు చేయడంతో ఈ సమస్యలు తలెత్తినట్లు సమాచారం. ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్‌లో నమోదు కావడం, జాబితాలో ఇంటినంబర్లు వరుససంఖ్యలో లేకపోవడంతో గందరగోళం మరింతగా పెరిగిపోయింది. సీతారాంపూర్, కాశ్మీర్‌గడ్డ, చింతకుంట, బొమ్మకల్ తదితర ప్రాంతాల ఓట్లు ఎక్కువగా ఇతర డివిజన్‌లో కనిపిస్తున్నాయి.
పెరిగిన ఐదు వేల ఓట్లు
గత ఏడాది జూన్‌లో డివిజన్‌ల పునర్విభజన సందర్భంగా నగరపాలకసంస్థలో 3,35,592 ఓట్లు ఉన్నట్లుగా డివిజన్లవారీగా అధికారులు జాబితాను ప్రకటించారు. తాజా జాబితాలో 66 డివిజన్లలో 3,40,775 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఆరు నెలల కాలంలో 5,183 ఓట్లు పెరగగా, అందులో కేవలం 7వ డివిజన్‌లోనే 1,279 ఓట్లు పెరగడం గమనార్హం 3,5,6 తదితర డివిజన్‌లలో మాత్రం పునర్విభజన సమయంలో కన్నా ఓట్లు తక్కువయ్యాయి.
6వ తేదీ వరకు అభ్యంతరాలు
66 డివిజన్‌ల ఓటర్ల జాబితాను శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. ఆయా డివిజన్లకు చెందిన మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు, నాయకులు, ఓటర్లు వచ్చి జాబితాలను పరిశీలించారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు స్వీకరించేందుకు కార్యాలయంలో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. మొదటి రోజు నాలుగు అభ్యంతరాలు వచ్చాయి. ఈ నెల 6వ తేదీలోగా అభ్యంతరాలు ఉంటే తెలియచేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ తెలిపారు.


