పశు వైద్యసేవలు వినియోగించుకోవాలి
కరీంనగర్‌రూరల్: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పశువైద్యసేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఎన్.లింగారెడ్డి కోరారు. శుక్రవారం కరీంనగర్ మండలం తాహెర్‌కొండాపూర్‌లో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పాడి పశువుల పెంపకంతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. అనంతరం 18ఆవులు, 26 గేదెలకు వైద్యపరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మినరల్ మిక్చర్ ప్యాకెట్లు అందించారు. సర్పంచ్ ఆకుల గిరి, ఉపసర్పంచ్ ఆకుల లావణ్య, పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు వినోద్, పశువైద్యులు జ్యోత్స్య, రామకృష్ణ పాల్గొన్నారు.
కొత్తపల్లి(కరీంనగర్): రైతులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్‌శాఖ అధికారులు ‘పొలంబాట’ ద్వారా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి, సమస్యలు పరిష్కరిస్తున్నారని టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు తెలిపారు. కరీంనగర్ సర్కిల్‌లో ఇప్పటి వరకు 1,055 పొలంబాట కార్యక్రమాలు నిర్వహించినట్లు, ఇందులో గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 572 వంగిన స్తంభాలను సరిచేశామని, 2,650 చోట్ల లూజ్ లైన్లను (వేలాడుతున్న వైర్లు) బిగించామన్నారు. అదేవిధంగా 1,343 మధ్య స్తంభాలను ఏర్పాటు చేశామన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు ఫెయిల్ కాకుండా ఉండేందుకు సరైన ఎర్తింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. మోటార్లకు కెపాసిటర్లు అమర్చుకోవడం వల్ల మోటార్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటమే కాకుండా నీళ్ల ప్రెషర్ మెరుగ్గా ఉంటుందని రైతులకు సూచించారు. విద్యుత్ ఇబ్బందులు తలెత్తితే వెంటనే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
అందుబాటులో యూరియా
కరీంనగర్ అర్బన్: జిల్లాలో 3,393 మెట్రిక్ టన్నుల యూరియాను వివిధ సొసైటీల్లో అందుబాటులో ఉంచినట్లు ఇన్‌చార్జి కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. 2,616 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని వివరించారు. సాగు విస్తీర్ణం, రైతుల అవసరాల క్రమంలో సరిపడా యూరియాను తెప్పిస్తామని ప్రకటనలో తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, అవసరం మేరకు మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.
క్వింటాల్ పత్తి రూ.7,400
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,400 పలికింది. శుక్రవారం మార్కెట్‌కు 110 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,300, కనిష్ట ధర రూ.6,900కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: రేకుర్తిలో విద్యుత్ లైన్ల పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రేకుర్తి, సమ్మక్క గద్దెలు, బుడిగ జంగాల కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు.
సర్వే లాండ్ ఏడీగా కిషన్‌రావు
కరీంనగర్ అర్బన్: భూ కొలతలు, రికార్డులశాఖ ఏడీగా కిషన్‌రావు బాధ్యతలు చేపట్టారు. ఏడీగా వ్యవహరించిన ప్రభాకర్‌ను ఆదిలాబా ద్‌కు బదిలీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 23మంది ఏడీలను బదిలీ చేయగా కరీంనగర్ ఏడీ ప్రభా కర్‌కు బదిలీ అనివార్యమైంది. కాగా కిషన్‌రావు మహబూబ్‌నగర్ ఏడీగా వ్యవహరించారు.
పశు వైద్యసేవలు వినియోగించుకోవాలి


