ఆపరేషన్ టైగర్!
పెద్దపులిని పట్టుకునేందుకు ప్రణాళిక
నేడు జిల్లాకు రెండు బృందాలు
ఆర్నకొండ, జూబ్లీనగర్‌లో కనిపించిన పులి అడుగులు
కరీంనగర్‌రూరల్/చొప్పదండి: జిల్లాను పెద్దపులి వణికిస్తోంది. కరీంనగర్ రూరల్, చొప్పదండి మండలాల్లో సంచరిస్తోందని గత ఐదు రోజులుగా వస్తున్న వార్తలు.. కనిపిస్తోన్న పాదగుర్తులు గ్రామీణ ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బహుదూర్‌ఖాన్‌పేట, రుక్మాపూర్, జూబ్లీనగర్, ఆర్నకొండతో పాటు పెద్దపల్లి జిల్లా సుల్తానాపూర్ ప్రాంతాల్లో పెద్దపులి పాదగుర్తులను అటవీ అధికారులు గుర్తించారు. పులిదాడిలో బహుదూర్‌ఖాన్‌పేటలో ఆవు, జూబ్లీనగర్‌లో గేదె మృతి చెందినట్లు పశువైద్యులు నిర్ధారించడంతో అప్రమత్తమైన అటవీ అధికారులు ‘ఆపరేషన్ టైగర్’ మొదలు పెట్టారు.
ఆరు ప్రత్యేక బృందాల ఏర్పాటు...
పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు కరీంనగర్ జిల్లాలో మూడు, పెద్దపల్లి జిల్లాలో మూడు ప్రత్యేకబృందాలను ఏర్పాటు చేశారు. వీరు పెద్దపులి జాడ, పాదముద్రలను గుర్తిస్తారు. శనివారం ఓ బృందం సిద్దిపేట జిల్లా నుంచి, మరో బృందం కవ్వాల్ రిజర్వు ఫారెస్ట్ నుంచి వస్తోంది.
హడలెత్తిసున్న వాట్సాప్ గ్రూపులు
కరీంనగర్‌రూరల్, చొప్పదండి మండలాల ప్రజలను పెద్దపులి భయం వెంటాడుతోంది. ఆయా గ్రామాల్లోని వాట్సాప్ గ్రూపుల్లో గురువారం ఎలబోతారం, జూబ్లీనగర్, బహుదూర్‌ఖాన్‌పేట, మొగ్ధుంపూర్, ఇరుకుల్ల, ఆర్నకొండ తదితర గ్రామాల్లో పులి సంచరించిదనే ఫొటోలు, సమాచారంతో భయాందోళన నెలకొంది. శుక్రవారం జూబ్లీనగర్‌లో బోగొండ రాయుడుకు చెందిన గేదె పులి దాడిలో చనిపోయిందని, మాల గుట్ట ప్రాంతంలో పులి అడుగులున్నాయనే స్ధానికుల సమాచారంతో అటవీ అధికారులు పరిశీలించారు. పాదముద్రలు గుర్తించి, నాలుగైదు రోజుల క్రితం గుట్టప్రాంతంలో పులి సంచరించినట్లు ధృవీకరించారు. పులిదాడిలోనే గేదే మృతిచెందిందని పశువైద్యులు రామకృష్ణ, జ్యోత్స్యలు నిర్ధారించారు. గతనెల 28న గేదైపె దాడి చేసిన పులి జూబ్లీనగర్ నుంచి ఫకీర్‌పేట మీదుగా రుక్మాపూర్‌కు వెళ్లిందని, అక్కడి నుంచి బహుదూర్‌ఖాన్‌పేట, సుల్తాన్‌పూర్‌వైపు వెళ్లినట్లుగా భావిస్తున్నారు.
ఆర్నకొండ శివారులో పులి అడుగులు?
చొప్పదండి మండలం ఆర్నకొండ శివారులో పులి సంచరించినట్లు ఆనవాళ్లు వెలుగు చూశాయి. కరీంనగర్ రూరల్ మండలం నగునూరు నుంచి జూబ్లీనగర్, రుక్మాపూర్ మీదుగా వెదురుగట్ట శివారుకు, అక్కడి వనం ద్వారా ఆర్నకొండ శివారులోని గుట్టల వద్దకు వెళ్లి పెద్దపల్లి జిల్లాలో ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పెద్దపులి సంచరించిన రుక్మాపూర్, బహుదూర్‌ఖాన్‌పేట, జూబ్లీనగర్, ఆర్నకొండ, సుల్తాన్‌పూర్ గ్రామాలతోపాటు సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. డీఎఫ్‌వో బాలమణి ఆదేశాలతో ఆయా గ్రామాల్లో సర్పంచులు దండోరా వేసి ప్రజలను అప్రమత్తం చేశారు. పులిభయంతో శుక్రవారం రాత్రి నుంచి నగునూరు– మొగ్ధుంపూర్ రహదారి, వెదురుగట్ట– బహుదూర్‌ఖాన్‌పేట, సుల్తాన్‌పూర్ రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. సోషల్ మీడియాలో పులి గురించిన వదంతులు, ఫొటోలతో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని చొప్పదండి ఎస్సై నరేశ్ రెడ్డి హెచ్చరించారు.
ఆపరేషన్ టైగర్!


