టీచర్లలో టెట్ టెన్షన్!
నేటినుంచి 20వ తేదీ వరకు పరీక్షలు
2012కు ముందు నియామకమైనవారికి టెట్ తప్పనిసరి
అర్హత సాధించకుంటే ఉద్యోగం ఊస్ట్
జిల్లాలో 2,334 మంది ఉపాధ్యాయులు
కరీంనగర్‌టౌన్: ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో టెట్ టెన్షన్ నెలకొంది. శనివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు టెట్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు ఇన్నాళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టారు. జిల్లాలోని ఎనిమిది కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో టెట్ పరీక్షలు జరగనున్నాయి. పేపర్–1, పేపర్–2 పరీక్షకు హాజరయ్యేవారికి ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.
సెలవు పెట్టి.. కోచింగ్ తీసుకుని..
నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం డీఎస్సీ పరీక్ష రాస్తున్న అభ్యర్థులతోపాటు దేశవ్యాప్తంగా 2012లోపు నియామకమైన టీచర్లంతా టెట్‌లో అర్హత సాధించాలని గతేడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇందుకు రెండేళ్ల వెసులుబాటు ఇచ్చింది. అర్హత సాధించకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఉద్యోగ విరమణకు ఐదేళ్ల కన్నా తక్కువ సర్వీసు ఉన్నవారికి మినహాయింపునిచ్చింది. ఈ తీర్పుతో ఇన్‌సర్వీస్ టీచర్లలో ఆందోళన నెలకొంది. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ), తెలుగు, హిందీ భాషా పండిత కోర్సులు చేసి, డీఎస్సీలో ప్రతిభ కనబరిచి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన తమకు టెట్ నిబంధన పెట్టడమేంటని సర్వీస్‌లోఉన్న ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును పాటించాల్సి ఉండటంతో పరీక్షకు సిద్ధమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 651 పాఠశాలలున్నాయి. వీటిలో 2,780 మంది టీచర్లు పనిచేస్తున్నారు. 2010 తర్వాత డీఎస్సీ ద్వారా నియామకమైన 393 మంది టెట్ అర్హత సాధించిన వారున్నారు. మిగితా 2,391మందిలో ఐదేళ్ల సర్వీస్ ఉన్నవారికి మినహాయింపు ఉంది. ఈ లెక్కన 2334 మంది టెట్ ఉత్తీర్ణులు కావల్సి ఉంటుంది. వీరితో పాటు జిల్లాలో నిరుద్యోగులు 15వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 16,393 మంది టెట్ రాయనున్నారు. పరీక్షల కోసం సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు మూడు నెలలుగా కుస్తీ పడుతున్నారు. కొందరు విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే.. లీజర్, భోజన విరామ సమయాల్లో చదువుకున్నారు. మరికొందరు సెలవుపెట్టి కోచింగ్ తీసుకున్నారు.
పిల్లలు, బంధువులతో సందేహాల నివృత్తి
ఇన్‌సర్వీస్ టీచర్లలో చాలామంది 20ఏళ్ల క్రితం ఉద్యోగాల్లో చేరినవారున్నారు. ఎస్‌జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొంది పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. వీరంతా టెట్–2 అర్హత సాధించాల్సి ఉండటంతో సందేహాలను నివత్తి చేసుకునేందుకు కొంతమంది పిల్లలు, బంధువులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
పరీక్ష వేళ.. బోధన ఎలా?
టెట్ రాసేందుకు చాలామంది ఇన్ సర్వీస్ టీచర్లు ఫీజు కట్టారు. కొంతమంది వచ్చే విడతలో చెల్లించి రాయాలని చూస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. టెట్ పరీక్ష రోజున ఉపాధ్యాయులందరూ స్కూల్‌ను విడిచి వెళ్లే పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రధానంగా ఇద్దరు, ముగ్గురు టీచర్లున్న ప్రాథమిక పాఠశాలల్లో, ఉర్దూ, హిందీ, మరాఠీ లాంటి మైనర్ మీడియం స్కూళ్లలో పని చేసే టీచర్లు పరీక్షకు హాజరైతే పిల్లలు ఖాళీగా కూర్చోవాల్సి వస్తుందని ఉపాధ్యాయ సంఘాలనాయకులు వాపోతున్నారు.


