సర్కారు బడిలో చదువు.. చక్కని కొలువు
ఉన్నత లక్ష్యం.. కఠోర శ్రమ సత్ఫలితాలిచ్చిన పట్టుదల ఉద్యోగంలోనూ ప్రత్యేకత పదోన్నతి పొందిన తహసీలార్లు స్ఫూర్తినిస్తున్న వనజ, జగదీశ్వర్‌రావు
జూలపల్లి/కాల్వశ్రీరాంపూర్: ప్రైవేట్ బడులు, కళాశాలల్లో చదివితేనే ఉన్నతంగా ఎదుగుతామనే చాలామంది భావనను పటాపంచలు చేశారు.. మంచిభవిష్యత్ నిర్మాణానికి లక్ష్యం నిర్దేశించుకున్నారు.. ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నారు.. పట్టుదలతో చదివారు.. కఠోరంగా శ్రమించారు.. సర్కారు బడిలో చదివి ఉన్నత లక్ష్యం సాధించారు.. ఉద్యోగంలోనూ ప్రత్యేకత చాటుకుని పదోన్నతి పొందారు జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్లు బదావత్ వనజ, పుల్లూరి జగదీశ్వర్‌రావు.. ఈ సందర్భంగా కథనం..
పేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి..
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపురం గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన బనావత్ దశరథ్ నాయక్ – లలిత దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ముడో కూతురు వనజ. గ్రామంలోనే ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు, ఎనిమిది నుంచి పదో తరగతి వరకు దండేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఐటీడీఏ సహకారంతో క రీంనగర్‌లో డిగ్రీ(కేయూలో ఓపెన్) ఉస్మానియా రెగ్యులర్ గా పీజీ పూర్తిచేశారు. ఎస్సీ స్టడీ సర్కిల్‌లో తర్ఫీదు పొందా రు. 2022 –24 వరకు యూపీపీఎస్సీ పరీక్షలకు ప్రిపేరయ్యారు. గ్రూప్–4లో తొలిప్రయత్నంలోనే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంటులో ఉద్యోగం సాధించించారు. ఆర్నెల్లకే లెక్చరర్‌గా ఉద్యోగం సాధించారు. లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూనే గ్రూప్– 2 పరీక్ష రాసి కో ఆపరేటివ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగం సాధించారు వనజ. అంతటితో ఆగకుండా పట్టుదలతో గ్రూప్–1 పరీక్షరాసి 504.5 మార్కులు సాధించారు. రాష్ట్రంలో 38వ ర్యాంక్‌తో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. సీఎం నుంచి ఇటీవల ఉద్యోగ నియామకపత్రం అందుకున్నారు. వనజను మనజిల్లాకు నియమించారు.


