ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో 5.87లక్షల మెట్రిక్ టన్నుల యూరియా
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారం ప్లాంట్ సామర్ధ్యం రోజూ 3,850 మెట్రిక్ టన్నులు. ఇందులో యూరియా 2,200 మెట్రిక్ టన్నులు. తెలంగాణతోపాటు ఆరు రాష్ట్రాలకు యూరియా సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 12.7 లక్షల మెట్రిక్ టన్నులను ఉత్పత్తి చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ లక్ష్యం విధించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 11,94,921.17 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. వార్షిక మరమ్మతులు, సాంకేతిక కారణంగా సూమారు 84 రోజులు ప్లాంటును షట్‌డౌన్ చేశారు. మరమ్మతుల అనంతరం 28 సెప్టెంబర్ 2025 నుంచి 30 డిసెంబర్ 2025 వరకు ప్రతీనెల 92 శాతం యూరియా ఉత్పత్తి చేశారు. 2025–26ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 30వ తేదీ నాటికి 5.87లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేశారు. ఇక్కడ తయారు చేసిన యూరియాలో 48 శాతం తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తున్నారు.
ఊపందుకున్న యాసంగి పనులు
తెలంగాణ రాష్ట్రలో యాసంగి(రబీ) పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా యూరియా ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఇటీవల కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రికి వినతిపత్రం అందించారు. 100 శాతం యూరియాను తెలంగాణకే కేటాయించాలని పేర్కొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో 3,26,574.03 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు.
యూరియా కేటాయింపులు ఇలా..
తెలంగాణ : 1,35,036.78 మెట్రిక్ టన్నులు
ఆంధ్రప్రదేశ్ : 81,066.23 మెట్రిక్ టన్నులు
కర్ణాటక : 47,223.74 మెట్రిక్ టన్నులు
తమిళనాడు : 31,406.55 మెట్రిక్ టన్నులు
మధ్యప్రదేశ్ : 16,171 మెట్రిక్ టన్నులు


