ఇసుక ట్రాక్టర్ కింద పడి యువకుడి మృతి
కోనరావుపేట/రుద్రంగి: రాత్రిపూట అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ట్రాక్టర్‌పై నుంచి పడి ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. రుద్రంగి మండలం డేగావత్ తండాకు చెందిన వినోద్ తన ట్రాక్టర్‌లో రాత్రిపూట అక్రమంగా ఇసుక రవాణా చేయడానికి చింతామణితండాకు చెందిన గుగులోత్ గంగాధర్(22)ను సోమవారం రాత్రి ఇసుక నింపేందుకు తీసుకెళ్లాడు. డేగావత్ తండానుంచి సమీపంలో ఉన్న కోనరావుపేట మండలం మరిమడ్ల శివారులోని జాలాగుకుంట వద్దకు వచ్చి ఇసుక నింపుకుని వెళ్తున్నారు. వినోద్ తన ట్రాక్టర్‌ను మైనర్ బాలుడు అయిన డేగావత్ చరణ్‌కు ఇచ్చి డ్రైవింగ్ చేయమన్నాడు. గంగాధర్ ట్రాక్టర్ ఇంజన్, ట్రాలి మధ్య నిలబడి ఉన్నాడు. అటవీశాఖ అధికారులు వెంబడిస్తున్నారని భావించి చరణ్ ట్రాక్టర్‌ను వేగంగా పోనిచ్చాడు. మరిమడ్ల ఏకలవ్య పాఠశాల దాటిన తర్వాత ట్రాక్టర్ నుంచి గంగాధర్ కిందపడ్డాడు. అతడిపై నుంచి ట్రాక్టర్ చక్రాలు వెళ్లి తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా అంబులెన్స్ చేరుకునే సరికే గంగాధర్ మృతిచెందాడు. మృతుడి తండ్రి సుకునా ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రశాంత్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


