రెండు లారీలు ఢీ.. డ్రైవర్లకు గాయాలు
పాలకుర్తి(రామగుండం): పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల బస్టాండ్ వద్ద రాజీవ్ రహదారిపై మంగళవారం రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా నుంచి సిమెంట్ లోడుతో గోదావరిఖని వైపు వెళ్తున్న లారీ మార్గమధ్యంలోని కన్నాల బస్టాండ్ సమీపంలో గల భారత్ పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోగా బైక్‌పై వెళ్తున్న దంపతులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ అడ్డుగా వచ్చారు. వారిని తప్పించబోయిన డ్రైవర్.. లారీని రహదారికి అవతలికి మళ్లించాడు. అదే సమయంలో బూడిదలోడుతో పెద్దపల్లి వైపు వెళ్త్ను టిప్పర్.. సిమెంట్ లారీని ఢీకొట్టి సమీపంలోని బస్టాండ్‌తో పాటు ఓ షాన్‌షాపును ఢీకొట్టింది. దీంతో లారీల ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యాయి. లారీ డ్రైవర్లు తీగల మహేశ్, దాసరి కిష్టయ్యకు గాయాలు కాగా బసంత్‌నగర్ ఎస్సై శ్రీధర్ వారిని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. ప్రమాదంతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది. హెచ్‌కేఆర్ టోల్‌ప్లాజా క్రేన్, జేసీబీల సాయంతో లారీలను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈఘటనలో కన్నాల బొడగుట్టపల్లిలోని బొడ్డుపల్లి నర్సయ్యకు చెందిన షాపు ధ్వంసమైంది. ప్రమాద సమయంలో స్థానిక బస్టాండ్‌లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడం, షాపు కూడా మూసి ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


