యువకుడి హత్య కేసులో నలుగురి అరెస్ట్
జగిత్యాలక్రైం: సమతతో ఇన్‌స్టాగ్రామ్‌లో సంధ్య ఐడీ పేరుతో స్నేహం చేసి.. మనది ఒకటే కులం.. నేను అబ్బాయినని పరిచయం చేసుకొని.. పెళ్లి కాలేదని నమ్మించి స్నేహం చేయడంతోపాటు ఆమె అక్కతో కూడా పరిచయం పెంచుకొని సమతకు వివాహం కాకుండా అడ్డు పడడంతో.. పథకం ప్రకారమే లక్ష్మీపూర్ గ్రామానికి రప్పించి యువకున్ని హత్య చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. ఆదివారం జగిత్యాల రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట గ్రామానికి చెందిన బుర్ర మహేందర్‌గౌడ్(33) జగిత్యాల పట్టణంలోని శంకులపల్లి ప్రాంతానికి చెందిన బైరవేని సమతతో ఇన్‌స్టాగ్రామ్‌లో సంధ్య ఐడీ పేరుతో స్నేహం చేశాడు. తర్వాత అబ్బాయినని, ఒకటే కులమని, పెళ్లి కాలేదని నమ్మించాడు. సమతకు తెలియకుండా ఆమె సోదరి సంధ్య ఫోన్‌ను హ్యాక్ చేసి ఆమె మొబైల్ నంబరును లేడీస్ సారీస్ కలెక్షన్స్ అనే వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశాడు. సంధ్యతో కూడా తరచూ మాట్లాడుతూ చాటింగ్ చేసేవాడు. అతడికి వివాహమైందని తెలిసి సమత దూరంగా ఉంటోంది. సమతకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే విషయం తెలుసుకొని వివాహం చేసుకోవద్దని, తననే పెళ్లి చేసుకోవాలని, లేకుంటే నీ ఫొటోలు మార్ఫింగ్ చేసి పెళ్లి కొడుకుకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. మీ అక్క సంధ్య కూడా నాతో ఫోన్లో మాట్లాడుతోందని, ఆమె ఫొటోలు, మీ కుటుంబ సభ్యుల ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. వెంటనే సమత అక్క సంధ్యకు జరిగిన విషయమంతా తెలిపింది. విషయాన్ని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మేనమామ నరేశ్‌కు తెలిపారు. నరేశ్, సంధ్య కుమారుడు రాజశేఖర్, అతడి ఇద్దరు మిత్రులతో కలిసి మహేందర్‌ను హత్య చేయాలని పథకం పన్నారు. సంధ్యతో మహేందర్‌కు ఫోన్ చేయించి లక్ష్మీపూర్ గ్రామానికి రావాలని పిలిపించారు. శుక్రవారం సంధ్యకు వాట్సాప్ మెసేజ్ ద్వారా శనివారం వస్తానని చెప్పాడు. మధ్యాహ్నం 3 గంటలకు మహేందర్ రాత్రి 10 లేదా 11 గంటలకు వస్తానని మెసేజ్ చేశాడు. సమతను వారి అమ్మమ్మ వారి ఇంట్లో ఉంచి నరేశ్‌కు చెందిన కారులో జగిత్యాల కొత్త బస్టాండ్‌కు వచ్చారు. వెనకాల స్కూటీపై సంధ్య కొడుకు రాజశేఖర్, అతడి స్నేహితులు వచ్చారు. సంధ్య కారులోంచి దిగి స్కూటీ తీసుకొని మహేందర్ రాగానే రాత్రి 10 గంటల సమయంలో కొత్త బస్టాండ్ నుంచి స్కూటీపై ఎక్కించుకొని లక్ష్మీపూర్‌కు బయల్దేరారు. వెనకాలే నరేశ్, రాజశేఖర్, అతడి ఇద్దరు స్నేహితులు స్కూటీని ఫాలో అవుతూ కారులో వచ్చారు. మహేందర్ ఇంట్లోకి చేరుకున్న కొద్దిసేపటికే నరేశ్, రాజశేఖర్, అతడి ఇద్దరు స్నేహితులు రావడం చూసి మహేందర్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. సంధ్య గేటు వద్ద మహేందర్‌ను పట్టుకోగా.. నరేశ్, రాజశేఖర్, మరో ఇద్దరు కొట్టి బెదిరించి ఫోన్ లాక్కున్నారు. సంధ్య ఇంట్లో ఉన్న కారంపొడి మహేందర్‌పై చల్లింది. అప్పటికే గాయాలైన మహేందర్ కింద పడిపోయాడు. కర్రలు, ఇనుప రాడ్‌తో రాజశేఖర్, అతడి ఇద్దరు మిత్రులు దాడి చేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహేందర్‌ను జగిత్యాల ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందాడు. మృతుడి తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను ఆదివారం లక్ష్మీపూర్ గ్రామ శివారులో అరెస్ట్ చేశారు. లక్ష్మీపూర్‌కు చెందిన గర్వందుల సంధ్య, గర్వందుల రాజశేఖర్, గర్వందుల నరేశ్, శంకులపల్లికి చెందిన బైరవేని సమతను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్కోడా కారు, స్కూటీ, ఇనుప రాడ్, కర్ర, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసులో ఉన్న నలుగురిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు. రూరల్ సీఐ సుధాకర్, రూరల్ ఎస్సై ఉమాసాగర్ పాల్గొన్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహంతో పరిచయం
అక్క, చెల్లెలిని ట్రాప్ చేసిన వైనం
పథకం ప్రకారమే హత్య
డీఎస్పీ రఘుచందర్


