రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
గొల్లపల్లి(ధర్మపురి): అబ్బాపూర్‌లో రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రెడపాక లింగయ్య(57), లచ్చవ్వ(49) గ్రామంలో మేసీ్త్ర పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం లచ్చవ్వ బంధువుల ఇంటికి హైదరాబాద్ వెళ్లేందుకు ఆదివారం ద్విచక్ర వాహనంపై దంపతులిద్దరూ కలిసి జగిత్యాల వెళ్తుండగా.. జగిత్యాల నుంచి గొల్లపల్లి వైపు అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన తవేరా వాహనం గొల్లపల్లి శివారులో బలంగా ఢీకొంది. లచ్చవ్వ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్ర గాయాలపాలైన లింగయ్యను చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని సందర్శించిన సీఐ రాంనర్సింహారెడ్డి వివరాలు సేకరించారు. వీరికి వివాహమైన కొడుకు, కూతురున్నారు. కోడలు రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి తెలిపారు.


