స్కూటీ డిక్కీలోని నగదు దొంగతనం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): స్కూటీ డిక్కీలో నుంచి రూ.99వేలను దొంగిలించిన అనుమానితుడి ఫొటోను ఆదివారం తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 11న జిల్లెల్ల గ్రామానికి చెందిన పబ్బతి ఎల్లారెడ్డి సిరిసిల్ల ఎస్‌బీఐ బ్యాంకు నుంచి రూ.99వేలు నగదు డ్రా చేసి స్కూటీ డిక్కీలో పెట్టుకొని వస్తూ మార్గమధ్యలో మెడికల్ షాపు వద్ద ఆగాడన్నారు. ఈ సమయంలో దొంగతనం జరిగిందని అన్నారు. సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించి నల్ల రంగు చొక్కా ధరించిన ఒక వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించామన్నారు. అతడికి సంబంధించిన సీసీ టీవీ ఫొటోను విడుదల చేశామని అన్నారు. ఎవరైనా గుర్తిస్తే వెంటనే సెల్ నంబర్ 8712656370కు సమాచారమందించాలని కోరారు.
బంగారు గొలుసు అపహరణ
కథలాపూర్(కోరుట్ల): గంభీర్‌పూర్ గ్రామానికి చెందిన ఇదునూరి సౌమ్య అనే మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసు దొంగలు ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు ఆదివారం తెలిపారు. ఉదయం సౌమ్య గంభీర్‌పూర్ గ్రామంలో ఆర్టీసీ బస్సు ఎక్కి రామడుగు మండలం వెదిర గ్రామానికి వెళ్తుండగా.. బస్సులో ఆమె మెడలో నుంచి దొంగలు బంగారు గొలుసు అపహరించారు. సౌమ్య బస్సు దిగిన తర్వాత గొలుసు కనిపించకపోవడంతో.. గ్రామంలోని బంధువులకు సమాచారమిచ్చారు.
కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లా అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని మానేరు డ్యాం కట్టపై నిర్వహించిన 11వ జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీలకు జిల్లావ్యాప్తంగా సుమారు 130 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అండర్ 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా పోటీలను నిర్వహించారు. అంతకుముందు ఈ పోటీలను వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి భూషణ్‌సింగ్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు బాబు శ్రీనివాస్‌గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. క్రాస్ కంట్రీ అనే వ్యాయామం తెలియకుండానే ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. నైపుణ్యం కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు నందెల్లి మహిపాల్ తెలిపారు. సుమన్, కళ్యాణ్, వ్యాయామ ఉపాధ్యాయులు ఎండీ అజాజ్, అహ్మద్, హరికిషన్, సమ్మయ్య, రమేశ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
స్కూటీ డిక్కీలోని నగదు దొంగతనం


