
మేడిపల్లి భూముల సేకరణకు చర్యలు
● పోలీసు పహారా మధ్య రైతుల ఇళ్లకు నోటీసులు
రామగిరి(మంథని): ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం రైతుల ఇళ్లకు నోటీసులు అంటించారు. రత్నాపూర్ పరిధి మేడిపల్లి శివారులోని భూముల స్వాధీనం కోసం రెవెన్యూ అధికారులు పోలీసు పహారా మధ్య పట్టదారుల ఇళ్లకు వెళ్లి వారి ఇళ్ల గోడలకు నోటీసులు అంటించారు. మేడిపల్లి శివారులో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్‌టేర్పాటుకు రైతుల భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని రెవెన్యూ అధికారులు ఈనెల 1న అభిప్రాయ సేకరణ చేపట్టారు. రైతులు వ్యతిరేకించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూసేకరణ కోసం నోటీసులు అంటించారు. తమ భూములను కోల్పోతే జీవనాధారం దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.