
చవితి సందడి
విద్యానగర్(కరీంనగర్): భక్తకోటి నుంచి తొలి పూజలు అందుకునే వినాయక నవరాత్రోత్సవాల సందడి ప్రారంభమైంది. కొలువుదీరేందుకు భారీ విగ్రహాలు వివిధ రూపాల్లో సిద్ధంగా ఉన్నాయి. గణేశ్ నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి యువత, కాలనీలవాసులు చందాలవేటలో మునిగిపోయారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో సందడి జోరందుకుంది. సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకునే ఆశవహులు ఈ సారి గణేష్ మండపాల ఏర్పాటులో ప్రధాన పాత్ర వహించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పోటాపోటీగా చందాలు రాస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో యువత, ఓట్లరు మచ్చిక చేసుకోవడానికి భారీగా విరాళాలు ఇవ్వడంతో పాటు, అన్నదానాలు, సౌండ్ సిస్టమ్, లైటింగ్, ప్రతిమల నిమజ్జనానికి వాహనాలు సమకూరుస్తామని హామీ ఇస్తున్నారు. కరీంనగర్‌లోనూ పలు డివిజన్లలో మాజీ కార్పోరేటర్లు, ప్రస్తుతం పోటీ చేయాలని చూస్తున్న వారు మండపాలకు భారీగా చందాలు రాస్తున్నారు. విగ్రహాలను సమకురుస్తామని, అన్నదానం చేస్తామని ముందుకొస్తున్నారు. కాగా.. వినాయక చవితి సంబరాలకు మండపాలు ముస్తాబు అవుతున్నాయి. నగరంలోని గంజ్, టవర్ సర్కిల్, బోయవాడ రావిచెట్టు, గాంధీరోడ్డు తదితర ప్రాంతాల్లో పెద్దపెద్ద మండపాలు సిద్ధం చేస్తున్నారు.
నవరాత్రోత్సవాలకు సిద్ధమవుతున్న మండపాలు
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఊరూరా జోష్
భారీగా విరాళాలు ఇస్తున్న ఆశావహులు
మండపాల ఏర్పాటుకు పోటాపోటీ