
ఊరట...ఉపాధి
ఆరేళ్లుగా నారుపెంచుతున్న
ట్రాన్స్‌పోర్టు ఖర్చులు తగ్గాయి
● స్థానికంగానే మిర్చినారు పెంపకం
● నాడు గుంటూరు.. నేడు ఉప్పట్ల
● వంద ఎకరాలకు సరిపడా సాగు
● అన్నదాతలకు తప్పిన రవాణా భారం
● పదిమంది కూలీలకు ఉపాధి అవకాశం
మంథనిరూరల్: ఒకరైతు ఆలోచన అనేకమంది అన్నదాతలకు ఊరటనిస్తోంది. ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి నారు తీసుకొచ్చి పంట సాగు చేసేవారికి ఎంతోప్రయోజనం కలిగిస్తోంది. మరికొందరు కూలీలకూ ఊపాధి చూపిస్తోంది. ఒకప్పుడు గుంటూరు వెళ్లి మిర్చినారు తీసుకువచ్చే రైతులకు ఇప్పడు తమ స్వగ్రామంలోనే నారు పెంచుకునే అవకాశం కల్పించాడో రైతు. ఉప్పట్ల గ్రామానికి చెందిన రైతు పోగుల తిరుపతి ఆరేళ్లుగా మిర్చినారు సాగు చేస్తూ రైతులపై భారం తగ్గించేలా చేశాడు. గ్రామ శివారులోని కొంత భూమిని కౌలుకు తీసుకుని డ్రిప్ పద్ధతిన నారు సాగు చేస్తున్నాడు.
ఒకప్పుడు గుంటూరు వెళ్లి..
ఉప్పట్ల గ్రామంలో అత్యధికంగా మిర్చి సాగు చేస్తుంటారు. ఇందుకోసం రైతులు ఏపీలోని గుంటూరుకు వెళ్లి ఆండ్రాడ్, ఎండ్‌పై లాంటి రకాల నారును తీసుకువచ్చి ఇక్కడ సాగు చేసేవారు. ప్రస్తుతం గ్రామంలోనే మిర్చినారు సాగు చేసుకునే అవకాశం లభించడంతో ఉప్పట్ల, గుంజపడుగు, విలోచవరం, పోతారంతోపాటు సమీప గ్రామాల మిర్చి రైతులకు ఊరట లభించింది.
తగ్గిన భారం.. నాణ్యమైన రకం
మిర్చిసాగు చేసే రైతులు గుంటూరు వెళ్లి నారు తీసుకురావడం తలకు మించిన భారమయ్యేది. ఉప్పట్లలోనే రైతులు కలిసి మిర్చినారు సాగు చేసుకోవడంతో అదనపు భారం తగ్గుతోంది. నాణ్యమైన రకాన్ని ఎంచుకునే అవకాశం లభించింది. గుంటూరు నుంచి తీసుకువచ్చే నారు ఎలాంటిదో తెలియక రైతులు అనేకసార్లు నష్టపోయిన సందర్భాలూ ఉన్నాయి.
రైతుకు ఇష్టమైన విత్తనాలను..
మిర్చి సాగుచేసే రైతులు తమకు ఇష్టమైన విత్తనాలను తీసుకువచ్చి ఇస్తే వాటిని అలికి నారు అయ్యే వరకు పెంచుతాడు. ఇందుకు ప్యాకెట్‌కు రూ.300 నుంచి రూ.400 వరకు చార్జీ తీసుకుంటాడు. సుమారు 45 నుంచి 50రోజుల వరకు మిర్చినారు నాటే స్థాయికి చేరుతుంది. ఇలా విత్తనాలను అలికి నారును ఇస్తుండటంతో స్థానిక రైతులకు ఉపశమనం లభించినట్లయింది,
ఆరేళ్లుగా నారుపెంచుతున్న
రైతులకు ఇష్టమైన వంగడాలు లేకపోవడంతో వారే విత్తనాలు తీసుకవస్తే అలికి నారు రెడీ చేసి ఇస్తా. అందుకయ్యే కూలీల ఖర్చులు తీసుకుంటా. ఉప్పట్లతో పాటు ఇతర ప్రాంతాల రైతులు ఇక్కడికే వచ్చి విత్తనాలు ఇచ్చి వెళ్తుంటారు. నాతో పాటు మరో పది మంది కూలీలకు ఉపాధి లభిస్తుంది.
– పోగుల తిరుపతి, రైతు, ఉప్పట్ల
ట్రాన్స్‌పోర్టు ఖర్చులు తగ్గాయి
మిర్చినారు కోసం ఏటా గుంటూరు వెళ్లే వాళ్లం. ఇందుకోసం మూడు, నాలుగు రోజుల సమయం పట్టేది. ఆ నారు నాణ్యత కూడా తెలిసేదికాదు. దిగుబడిపై ఆశలు ఉండేవికావు. తిరుపతి ఆలోచనతో ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు, సమయం మిగులుతోంది. నాలుగు ఎకరాలకు సరిపడా మిర్చినారు సాగు చేయిస్తున్న.
– ముచ్చకుర్తి శేఖర్, రైతు, గుంజపడుగు

ఊరట...ఉపాధి

ఊరట...ఉపాధి