
పెన్షన్ పెంపుపై నిబద్ధత లేదు
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
హుజూరాబాద్: పెన్షన్ల పెంపుపై పాలకులు, ప్రతిపక్షాలకు నిబద్ధతలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆరోగ్య శ్రీ సాధన కోసం ఎమ్మార్పీఎస్ ఎంతో శ్రమించిందని గుర్తుచేశారు. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పెన్షన్ల పెంపు కోసం ఈనెల 13న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన మహా గర్జనను విజయవంతం చేయాలని కోరుతూ.. గురువారం హుజూరాబాద్‌లోని సాయిరూప గార్డెన్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. పెన్షన్లు పెంచకుంటే రేవంత్‌రెడ్డిని గద్దె దించుతామని హెచ్చరించారు. కేసీఆర్ మౌనం వీడాలని, గడీ నుంచి బయటకు రావాలన్నారు. రేవంత్ ప్రభుత్వం 50లక్షల మంది దివ్యాంగులను మోసం చేస్తుంటే కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా పోరాడాలని సూచించారు. పెన్షన్లు పెంచడమా..? రేవంత్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయడమా తెలుసుకోవడమే మహాగర్జన సభ ప్రధాన ఉద్దేశమన్నారు. దివ్యాంగులకు రూ.6వేలు, ఆసరా పెన్షన్ రూ.4 వేలు, తీవ్ర వైకల్యం ఉన్న వారికి రూ.15 వేలు ఇవ్వాలని మహాగర్జన నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.