
వరాలతల్లికి జేజేలు
● నేడు వరలక్ష్మీ వ్రతం
● సౌభాగ్యాన్ని ఇచ్చే వ్రతంగా
మహిళల విశ్వాసం
● పేరంటాలు.. వాయినాలు
బోయినపల్లి(చొప్పదండి): శ్రీలక్ష్మీదేవీ రావమ్మా.. కోరిన కోర్కెలు తీర్చవమ్మా.. అంటూ మహిళలు వరలక్ష్మీదేవీని కొలుస్తారు. మహిళలకు మంగళప్రదం వరలక్ష్మీ వ్రతం. కోర్కెలు తీరుస్తూ మహిళలకు కొంగు బంగారం.. సౌభాగ్యాన్ని ప్రసాదించే వరాలతల్లి వరలక్ష్మీ. ఈ వ్రతం ఏటా శ్రావణమాసంలోని రెండో శుక్రవారం నిర్వహిస్తారు. వరలక్ష్మీ వ్రతాలకు ఏటేటా ఆదరణ పెరుగుతోంది.
● వరలక్ష్మీ పూజ విధానం
ఇంట్లో వరలక్ష్మీ వ్రతం ఆచరించే స్థలంలో నీటితో శుద్ధి చేసి పీట వేయాలి. దానిపై తెల్లని వస్త్రం పరచి ముగ్గులతో అలంకరించాలి. దానిపై కలశం(రాగి చెంబు) ఉంచాలి. కలషంలో బియ్యం, పసుపుకొమ్ములు, వక్కలు, ఎండు ఖర్జూరాలు, నాణేలు, ఉన్నంతలో బంగారు, వెండి వస్తువులు ఉంచాలి.
నారీకేళంతో శ్రీలక్ష్మీ పిండిబొమ్మ : నారీకేళంపై పిండితో శ్రీలక్ష్మీదేవీ అమ్మవారి బొమ్మ తయారు చేయాలి. ఆ ప్రతిమను నారీకేళంపై ఉంచాలి. నూ తన వస్త్రం చుట్టాలి. ఆభరణాలు ధరించాలి. జెడను పుష్పాలతో అలంకరించాలి. శ్రీలక్ష్మీ అమ్మవారి ప్రతిమకు ఇరువైపులా ఏనుగు బొమ్మలు ఉంచాలి. ఏనుగు బొమ్మ లేనిచో తమలపాకులు ఉంచాలి. నవగ్రహ పూజ చేయాలి. అనంతరం అమ్మవారి ఐదు వ్రత కథలను ఆచార్యులు వినిపిస్తారు. ఒక్కో కథకు ఒక్కో టెంకాయ నైవేద్యం సమర్పించాలి.
● లక్ష్మీదేవికి 12 రకాల పిండివంటలు
మహలక్ష్మీ అమ్మవారికి వీలైనంతలో 12 రకాల పిండి వంటలతో శ్రీమహాలక్ష్మీ అక్షయ ఫలాల ప్రసాదం నివేదించాలి. అమ్మవారికి పళ్ల రసం అత్యంత ప్రీతిపాత్రమైంది. ఆవుపాలతో అమ్మవారికి పరమాన్నం నివేదించాలి. దీంతో అమ్మవారు అన్నపానాదులకు లోటు లేకుండా చేస్తుంది. పిండివంటలలో అమ్మవారికి శెనగల ప్రసాదం ప్రీతిపాత్రం.
● సాయంత్రం పేరంటాలు
వరలక్ష్మీ వ్రతం ఆచరించే మహిళలు సాయంత్రం 8 మంది ముత్తయిదువలను పేరంటాలకు పిలుస్తారు. తొమ్మిడి ముడులతో తోరణాలు తయారు చేసి వారికి వరలక్ష్మీ రక్ష కంకణ తోరణం చుడతారు. అనంతరం అమ్మవారికి పంచహారతి సమర్పిస్తారు. హాజరైన మహిళలకు తాంబూలం ఇస్తారు. వారు తలంబ్రాలతో వ్రతం నిర్వహించుకునే వారిని ఆశీర్వదిస్తారు. ఇది అనాదిగా వస్తున్న వ్రత ఆచారం.
కలశంలో వేసిన వాటి విషిష్టత
బియ్యం : సంవత్సరాంతం అన్నపానాదులకు లోటు లేకుండా చేస్తుంది.
వక్కలు : భర్తల ఆరోగ్యాన్ని బాగుంచుతాయి.
పసుపు : మహిళలకు సౌభాగ్యాన్నిస్తాయి.
నాణేలు : ధనధాన్యాలు సమృద్ధినిస్తాయి.
కర్జూరాలు : సంతోషాన్నిస్తాయి.