
బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
వెల్గటూర్: స్కూల్ బస్సును తప్పించబోయిన ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొన్న సంఘటన మండలంలోని కప్పారావుపేట వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కప్పారావుపేట వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా కుడివైపు తిప్పాడు. దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆ బస్సును తప్పించే క్రమంలో కుడివైపు తిప్పాడు. అదే సమయంలో వెల్గటూర్ నుంచి ధర్మారం వైపు వెళ్తున్న బైక్ ఎదురుగా రావడంతో బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న మండలంలోని పాశిగామకు చెందిన కాండ్రపు మహేశ్, ధర్మపురి మండలం రాయపట్నంకు చెందిన పోతరాజుల కమలాకర్, పిట్టల చందుకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108లో ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతోనే పెద్ద ప్రమాదం తప్పిందని, ఒకవేళ స్కూల్ బస్సును ఢీకొడితే చిన్నారులు ప్రమాదానికి గురయ్యేవారని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు విచారణలో తెలియాల్సి ఉంది.
ముగ్గురికి తీవ్రగాయాలు
తృటిలో తప్పిన పెను ప్రమాదం