
కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలి
ధర్మారం(ధర్మపురి): కరెన్సీపై అంబేడ్కర్ ఫొటోను ముద్రించాలనే డిమాండ్ పార్లమెంట్‌లో ప్రస్తావించాలని అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ డిమాండ్ చేశారు. కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బుధవారం ఫొటో సాధన సమితి నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ మా ట్లాడుతూ జాతీయ జెండాలో అశోక్ చక్రం పెట్టిన రోజు.. జూన్ 23న ప్రారంభమైన లక్ష మందితో పోస్టుకార్డుల ఉద్యమం 2026 జనవరి వరకు ముగుస్తుందన్నారు. ఇందులో భాగంగానే జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తున్నట్లు ఆయన వివరించారు. 1921లో ఇంపీరియల్ బ్యాంక్ కుప్పకూలినప్పుడు అంబేడ్కర్ చేసిన ప్రయత్నంతోనే 1935లో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాగా ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఐ పార్టీ జాతీయ అధ్యక్షుడు జాన్, ఓబీసీ విద్యార్థి విభాగం జాతీయ అధ్యక్షుడు కిరణ్, కరెన్సీ అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లి స్వామి, చంద్రహాస్, సంపత్ చంద్రహాస్ తదితరులు పాల్గొన్నారు.