నేటి నుంచి ఎస్సారెస్పీ నీటి విడుదల | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎస్సారెస్పీ నీటి విడుదల

Aug 7 2025 9:44 AM | Updated on Aug 7 2025 9:44 AM

నేటి

నేటి నుంచి ఎస్సారెస్పీ నీటి విడుదల

జగిత్యాలఅగ్రికల్చర్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి గురువారం సాగునీరు విడుదల చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గతేడాది జూన్‌లో వర్షాలు ప్రారంభమై.. జూలైలో కురిసిన భారీ వర్షాలకు ఎస్సారెస్పీ నిండింది. ఫలితంగా పలుమార్లు ప్రాజెక్టు గేట్లు ఎత్తి గోదావరిలోకి వదిలారు. అలాగే అవసరం లేకున్నా భూగర్భజలాలు పెరుగుతాయనే ఉద్దేశంతో వరదకాల్వకూ నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది వర్షాలు అంతంతమాత్రంగానే కురవడంతో ప్రాజెక్టులోకి నీరు పూర్తిస్థాయిలో చేరలేదు. ఫలితంగా ఆయకట్టుకు నీరు విడుదల చేసే అవకాశం లేదు. ఈ క్రమంలో నీటి సౌలభ్యాన్ని బట్టి ఆన్‌, ఆఫ్‌ పద్ధతిలో విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్టులో ఉన్న నీటినే యాసంగి పంటలకూ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి.. ఈ వానాకాలం పంటకు పరిమితంగానే నీరు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. సాగునీటిని వృథా చేయకుండా కాలువలపై గట్టి భద్రత చర్యలు తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాంతాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. కొన్నిచోట్ల ప్రాజెక్టు నీటిపై ఆధారపడిన వారు మాత్రం నాట్లు వేయలేదు. ప్రాజెక్టు నీరు వస్తే నాట్లు వేసే అవకాశం ఉంది.

రోజుకు 4 వేల క్యూసెక్కుల నీరు

ఎస్సారెస్పీ నుంచి జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాలకు కాకతీయ కాలువ ద్వారా నీరు అందుతుంది. కాకతీయ కాల్వ సామర్థ్యం 6 వేల క్యూసెక్కులు. కట్టలసామర్థ్యం సరిగా లేకపోవడంతో రోజుకు 4 నుంచి 5 వేల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేయాలని భావిస్తున్నారు. తొలి రెండురోజులు రెండు వేల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేసి తర్వాత నుంచి సామర్థ్యాన్ని పెంచనున్నారు. జగిత్యాల జిల్లాలో వ్యవసాయ బావులు అత్యధికంగా ఉన్నా.. రైతులు ఎక్కువగా ఎస్సారెస్పీ నీటిపైనే ఆధారపడుతున్నారు. జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుకానున్నాయి. వరిపంటే దాదాపు మూడు లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. కాకతీయ కాలువ డిస్ట్రిబ్యూటరీలకు తూములు పెట్టడంతో చెరువులు, కుంటలకు నీటిని వదలనున్నారు. కాలువకు ఇరువైపులా విద్యుత్‌ మోటార్లు బిగించుకుని రైతులు సాగు నీటిని వాడుకునే అవకాశం ఉంది.

40.582 టీఎంసీలకు నీటి నిల్వలు

గతంలో జూలైలోనే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండేది. ఈ ఏడాది ప్రాజెక్టులోకి అంతంతమాత్రంగానే నీరు చేరింది. ఈ ఏడాది జూన్‌ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 31.552 టీఎంసీలు చేరగా.. 3.757 టీఎంసీలను బయటకు వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగులకుగాను.. ప్రస్తుతం 1078.30 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు 40.582 టీఎంసీల నిల్వ ఉంది. తాగునీటి కోసం మిషన్‌ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 793 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.

40.582 టీఎంసీలకు నీటి నిల్వలు

కాకతీయ, సరస్వతి, లక్ష్మీకాలువల ద్వారా పంటలకు..

నేటి నుంచి ఎస్సారెస్పీ నీటి విడుదల1
1/1

నేటి నుంచి ఎస్సారెస్పీ నీటి విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement