
సీబీఎస్‌ఈ క్లస్టర్–7 టేబుల్ టెన్నీస్ పోటీలు ప్రారంభం
కరీంనగర్‌స్పోర్ట్స్/కొత్తపల్లి: కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ పాఠశాలలో బుధవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీబీఎస్‌ఈ పాఠశాలల క్లస్టర్–7 బాలికల టేబుల్ టెన్నీస్ చాంపియన్ షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని సీబీఎస్‌ఈ పాఠశాలల నుంచి 2,500 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలను రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా క్రీడల్లో సాధన చేసి, విజయం సాధించాలన్నారు. దేశంలో పారా ఒలంపిక్ అథ్లెట్ దీపా మాలిక్ సాధించిన విజయం స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. దీప్తి రాష్ట్ర క్రీడా రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగడం శుభపరిణామన్నారు. డీసీపీ వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్థులు పోటీతత్వంతో దూసుకుపోవాలన్నారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాల వార్షిక ప్రణాళికలో భాగంగా నిపుణులైన ఉపాధ్యాయులతో విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. జిల్లా క్రీడాశాఖ అధికారి వి.శ్రీనివాస్‌గౌడ్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష,కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, పోటీల అబ్జర్వర్ పద్మారావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు 2,500 మంది క్రీడాకారుల హాజరు