సన్నబియ్యం.. డీలర్ల పరేషాన్
కరీంనగర్‌రూరల్: కేంద్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు ఒకేసారి మూడునెలల బియ్యం పంపిణీ చేయాలనే నిర్ణయం డీలర్లకు పెద్ద సమస్యగా మారింది. ఈ పాస్ యంత్రాల్లో నెలకొన్న సాంకేతిక సమస్యతో బియ్యం పంపిణీ ఆలస్యం అవుతోంది. లబ్ధిదారులు గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. రేషన్ డీలర్లు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ.. పరిష్కరించకపోవడంతో ఆదివారం జిల్లావ్యాప్తంగా బియ్యం పంపిణీ ప్రక్రియ గందరగోళంగా మారింది. కేంద్ర ప్రభుత్వం వానాకాలంలో రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు ఇబ్బందులకు గురికావద్దనే ఉద్దేశంతో జూన్, జూలై, ఆగస్టు మాసాల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈపాస్ యంత్రాల్లో 3.2 కొత్త సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి లింక్‌చేశారు. ఆదివారం నుంచి డీలర్లు బియ్యం పంపిణీ ప్రారంభించారు. ఈపాస్ యంత్రాల్లో నెలకొన్న సాంకేతిక సమస్యతో డీలర్లు ఇబ్బందులకు గురయ్యారు. ఒక్కో లబ్ధిదారుడు మూడు నెలల బియ్యం పొందాలంటే ఈపాస్ మిషన్‌పై ఆరు పర్యాయాలు వేలిముద్ర వేయాల్సి వస్తోంది. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి అరగంట సమయం పడుతోందని డీలర్లు పేర్కొంటున్నారు. సర్వర్ స్లోగా ఉండటంతో ఈపాస్ యంత్రాల్లో లబ్ధిదారుల వివరాల నమోదులో జాప్యమేర్పడుతోంది. ఈపాస్ మెషిన్లలో నెలకొన్న సాంకేతిక సమస్యలను సివిల్‌సప్లై అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు కరీంనగర్ మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు తాటి పూర్ణచందర్‌రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి నెలకు 5కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం కిలో చొప్పున వేర్వేరుగా బియ్యం కోటాను లబ్ధిదారులకు మంజూరు చేస్తుండటంతో ఒక్కొక్కరు రెండు పర్యాయాలు వేలిముద్ర వేయాల్సి వస్తోందని సివిల్‌సప్లై అధికారులు తెలిపారు.
ఈపాస్ యంత్రంలో సాంకేతిక సమస్య
మూడు నెలలకు ఆరుసార్లు వేలిముద్ర
ఒక్కో లబ్ధిదారుడికి అరగంట సమయం
సన్నబియ్యం.. డీలర్ల పరేషాన్


