వెల్గటూర్‌లో పిచ్చి కుక్క వీరంగం
వెల్గటూర్: మండలకేంద్రంలో ఆదివారం ఓ పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది. గంట వ్యవధిలో ముగ్గురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిందం వర్షిత్ (21 నెలలు) కంటిపై దాడి చేసింది. అలాగే ఇంటి ముందు పనులు చేసుకుంటున్న మరో ఇద్దరు మహిళలపై దాడికి పాల్పడింది. గతంలో కోటిలింగాలలో మంచికట్ల మణితేజ (ఆరేళ్ల) ఇంటిముందు ఆడుకుంటుండగా కుక్క విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాలుడికి రేబిస్ వ్యాధి సోకింది. చెర్లపల్లిలో సంకటి మల్లయ్యకు చెందిన 20 గొర్రె పిల్లలపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. జగదేవుపేటలో నాలుగు గేదెలను చంపేశాయి. ఇలా నెల వ్యవధిలోనే సుమారు 40 పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


