గత తప్పులతోనే రూ.కోట్లు వృథా
● బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై సుడా చైర్మన్ ధ్వజం
కరీంనగర్ కార్పొరేషన్: గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులతో నగరంలో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. చేసిందంతా చేసి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై నెపం నెట్టివేయడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం నగరంలోని సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడుతూ కేబుల్ బ్రిడ్జిపై రూ.6 కోట్లతో డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారని, టెండర్‌లో బాధ్యత, భద్రత మరిచిపోవడంతో, నెల రోజుల్లోనే విలువైన సామగ్రి దొంగలపాలైందన్నారు. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం సంబంధమన్నారు. కోట్ల రూపాయలతో ఆధునీకరించిన కూడళ్లలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని అన్నారు. స్మార్ట్‌సిటీ నిధులు రూ.16 కోట్లతో డంప్‌యార్డ్‌లో ఏర్పాటు చేసిన బయోమైనింగ్ మిషన్ ఎందుకు పనిచేయకుండా పోయిందో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దన్నసింగ్, జీడీ రమేశ్, కొడూరి రవీందర్‌గౌడ్, బత్తిని చంద్రయ్య, మార్క రాజాగౌడ్, నదీమ్, సాయికిరణ్ పాల్గొన్నారు.
నేడు వాలీసుగ్రీవ ఆలయ వార్షికోత్సవం
శంకరపట్నం: కన్నాపూర్ వాలీసుగ్రీవ దేవాలయంలో సోమవారం సీతారాముల వార్షిక వేడుకలకు ఆలయం ముస్తాబు చేశారు. వార్షికోత్సవం సందర్భంగా సోమవారం పంచామృత అభిషేకం, సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. మంగళవారం హోమ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


