క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు
● నేడు కరీంనగర్, గోదావరిఖని, జగిత్యాల, వేములవాడ శిక్షణ శిబిరాల్లో ఎంపికలు
కరీంనగర్‌స్పోర్ట్స్: క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించేందుకు కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం శ్రీకారం చుట్టింది. క్రీడాకారుల ప్రతిభ ఆధారంగానే ఎంపికలు జరిగే అవకాశాలు ఉంటాయని క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. ప్రస్తుతం అండర్– 17 నుంచి 23 వరకు ఎంపిక పోటీలు నిర్వహించి భవిష్యత్‌లో అన్నిరకాల కేటగిరీలో ఇలాగే ఎంపికలు నిర్వహించేందుకు సన్నద్ధం చేయనున్నట్లు తెలిపారు.
13 నియోజకవర్గాలు.. 6 జట్లు..
ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల నుంచి 6 జట్లను ఎంపిక చేయనున్నారు. కరీంనగర్ టౌన్ 1వ జట్టు, కరీంనగర్ రూరల్, చొప్పదండి 2, పెద్దపల్లి, మంథని, రామగుండం 3, సిరిసిల్ల, వేములవాడ 4, జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి 5, మానకొండూర్, హుస్నాబాద్, హుజురాబాద్ 6వ జట్టుగా ఎంపిక చేసినట్లు సంఘం బాధ్యులు తెలిపారు. కరీంనగర్, వేములవాడ, జగిత్యాల, గోదావరిఖనిలోని క్రికెట్ శిబిరాల్లో ఎంపిక పోటీలు జరుగనున్నాయి. క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణపత్రం, ఆధార్, సొంత కిట్, వైట్ డ్రెస్‌తో హాజరుకావాలని పేర్కొన్నారు.
కరీంనగర్ డ్రిస్ట్రిక్ట్ జట్టు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6 జట్ల ఎంపిక అనంతరం రౌండ్ రాబిన్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తారు. లీగ్స్, క్వార్టర్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ నిర్వహించి ఎవరైతే అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తారో వారిని కరీంనగర్ జిల్లా జట్టుకు ఎంపిక చేస్తారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్‌లో జరిగే పోటీల్లో పాల్గొననున్నట్లు సమాచారం.
పటిష్ట జట్టు ఎంపిక కోసం..
ప్రస్తుతం క్రికెట్ ఎంపిక పోటీలకు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరవుతున్నారు. అందరి ప్రతిభను చూడలేకపోతున్నాం. అప్పుడప్పుడు మంచి క్రీడాకారుడు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడీ పోటీలతో క్రీడాకారులు తమ టాలెంట్ ఒక మ్యాచ్‌లో మిస్సయితే మరో మ్యాచ్‌లో చూపించే అవకాశం ఉంటుంది. ఉత్తమ జట్టు ఎంపిక చేసే అవకాశం కూడా కలుగుతుంది.
– ఆగంరావు, జిల్లా అధ్యక్షుడు
క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు


