సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
సైదాపూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రైతు సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం మండలంలోని దుద్దెనపల్లి, బొమ్మకల్ గ్రామాల్లో నిర్వహించిన రైతు సదస్సులో పాల్గొని రైతులతో ముఖాముఖి నిర్వహించారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా సైదాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని అన్నారు. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో భూ రికార్డుల్లో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాసుబుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్దారణ, పార్ట్–బీలో చేర్చిన భూముల సమస్యలు, తదితర అంశాలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. కొత్త ఆర్వోఆర్ చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పరిష్కారం చూపుతారన్నారు. ఫైలట్ మండలంలో సదస్సులు పూర్తి అయిన తర్వాత జిల్లావ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తామన్నారు. రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. అక్కడే పరిష్కారమయ్యే దరఖాస్తులను తహసీల్దార్ పరిశీలించాలని ఆదేశించారు. హుజూరాబాద్ ఆర్డీవో రమేశ్‌బాబు, తహసీల్దార్ శ్రీనివాస్, కనకయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
● కలెక్టర్ పమేలా సత్పతి


