
డంపు.. కంపు.. నిప్పు
● సబ్‌స్టేషన్‌కు పొంచి ఉన్న ప్రమాదం ● ఆందోళనలో విద్యుత్ సిబ్బంది
కొత్తపల్లి: కరీంనగర్ హౌజింగ్‌బోర్డు కాలనీలోని 33/11 కె.వీ.సబ్‌స్టేషన్‌కు ప్రమాదం పొంచి ఉంది. సబ్‌స్టేషన్ ప్రహరీని ఆనుకొని మున్సిపల్ డంపింగ్ యార్డు ఉండటం విద్యుత్ సిబ్బందికి ఇబ్బందిగా మారింది. డంపింగ్ యార్డులోని చెత్తకు నిప్పు పెడుతుండటంతో సబ్‌స్టేషన్‌లోని ఆపరేటర్లు దుర్వాసన, పొగతో ఇబ్బంది పడుతున్నారు. డంపింగ్ యార్డులోని మంటలతో సబ్‌స్టేషన్‌కు ప్రమాదం పొంచి ఉంది. వేసవికాలం గాలులు వీస్తుండటంతో ప్రమాదవశాత్తు సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్తపై పడితే, అందులోని ఆయిల్‌కు అంటుకుంటే ప్రమాదం తీవ్రంగా ఉండనుందన్న ఆందోళన సిబ్బందిలో నెలకొంది. మంగళవారం డంపింగ్ యార్డు వద్ద ముక్కుకు రుమాలు కట్టుకొని విద్యుత్ సిబ్బంది నిరసన వ్యక్తం చేసారు. అనేక మార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినప్పటికీ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసనతో కూడిన పొగ వల్ల స్థానికులతో పాటు తాము అనారోగ్యాల పాలవుతున్నామని, అక్కడ విధులు నిర్వర్తించడం కష్టంగా ఉందన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి డంపింగ్ యార్డును ఎత్తేయాలని విజ్ఞప్తి చేశారు.