
ఆదర్శం.. ఆటోలక్ష్మి
● చిన్నతనంలోనే తండ్రి.. పిల్లలు చిన్న వయసులో భర్త మృతి
● ఆటోలో ఊరూరా తిరుగుతూ కూరగాయల విక్రయం
● ఆ కుటుంబానికి ఆమె ఆధారం
కోనరావుపేట(వేములవాడ): ఆ కుటుంబానికి ఆమెనే పెద్ద దిక్కు. చిన్నతనంలో తండ్రి మృతి.. పిల్లలు పుట్టాక భర్త మరణంతో ఆ కుటంబం రోడ్డున పడింది. అయితే తన పిల్లల బాధ్యతను లక్ష్మి భుజాన వేసుకుంది. ధైర్యంతో ముందడుగు వేసింది. ఆటోలో కూరగాయలు విక్రయిస్తూ తన కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. తన పిల్లలు, కన్నతల్లిని పోషించుకుంటోన్న కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన ఎర్ర లక్ష్మిపై ప్రత్యేక కథనం.
భర్త మృతితో మళ్లీ మొదటికి..
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన అనుముల యాదవ్వ–మల్లయ్య దంపతులకు నలుగురు కూతుళ్లు. చిన్న కూతురు లక్ష్మికి కరీంనగర్ సమీపంలోని గోపాలపురం గ్రామానికి చెందిన ఎర్ర అంజయ్యతో వివాహమైంది. 2013లో అంజయ్య సౌదీఅరేబియా వెళ్లి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటికే కూతురు, కుమారుడు సంతానం. అత్తగారింటి వద్ద వ్యవసాయ భూమి, సరైన ఇల్లు కూడా లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పుట్టినింటికి చేరింది. తండ్రి చిన్నప్పుడే మృతిచెందడం, అక్కలు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోవడంతో ఒంటరైన తల్లి, కుమారుడు, కూతుళ్ల పోషణభారం నెత్తికెత్తుకుంది. ఐదేళ్ల క్రితం కూరగాయల వ్యాపారం మొదలుపెట్టింది.
ఆటోలో ఊరూరా తిరుగుతూ..
నిమ్మపల్లిలో ప్రతి శుక్రవారం జరిగే వారసంతలో కూరగాయలు అమ్ముకుంటూ మిగతా రోజుల్లో గ్రామంలో తిరుగుతూ విక్రయించేది. వచ్చిన డబ్బులు కుటుంబపోషణకు సరిపోకపోవడం, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి, కుమారునికి వైద్య ఖర్చులకు ఇబ్బంది కావడంతో రూ.60వేలు అప్పు చేసి ఓ ఆటో కొనుగోలు చేసింది. ఆటోలో కూరగాయలు విక్రయించేందుకు మరిమడ్ల, అహ్మద్‌హుస్సేన్‌పల్లి, నిజామాబాద్ జిల్లా తాటిపల్లి, సిరికొండ వరకు ఆటో వెళ్లి కూరగాయలు విక్రయిస్తోంది. వర్షం పడినా, ఎండ తీవ్రత ఎక్కువున్నా కూరగాయలు మాత్రం విక్రయిస్తూనే ఉంటుంది. కూతురు నిహారిక ప్రస్తుతం ఎనిమిదో తరగతి, కుమారుడు మణికృష్ణ ఆరో తరగతి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇంట్లో మగదిక్కు లేకున్నా ధైర్యంతో ఆ కుటుంబానికి ఆధారమైంది.
ఆత్మవిశ్వాసంతో ముందుకు..
ఎలాంటి ఆధారం లేకున్నా ఆత్మశ్వాసాన్ని కోల్పోకుండా నా ఇద్దరు పిల్లల చదువు, తల్లిని పోషిస్తున్నాను. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆటో కొని, అందులోనే కూరగాయలు విక్రయిస్తున్నాను. నా వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు ప్రభుత్వం సహకారం అందించి, ఆదుకోవాలి.
– ఎర్ర లక్ష్మి, నిమ్మపల్లి

ఆదర్శం.. ఆటోలక్ష్మి