ఎస్సారార్ కాలేజీలో ‘నల్లబల్ల’ చదువులేనా..?
37 తరగతి గదులకు 8 గదుల్లోనే డిజిటల్ బోర్డులు
మిగతావాటిలో బ్లాక్ బోర్డులపైనే బోధన
పట్టించుకోని అధికారులు
ఇన్‌చార్జిల పాలనలో ఇబ్బందులు
కరీంనగర్‌సిటీ: దేశంలో విద్యారంగం డిజిటల్ విప్లవంతో సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఒకవైపు అల్టిమేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), యానిమేటెడ్ 3డీ లెర్నింగ్, విజువల్ గ్రాఫిక్స్, ఇంటరాక్టివ్ ప్యానెల్స్ విద్యాబోధనను శాసిస్తున్నాయి. నేటి తరం విద్యార్థుల చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు, హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాలు ఉన్నాయి. కాగా, ఉత్తర తెలంగాణలోనే వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు దిక్సూచి అయిన కరీంనగర్ ఎస్సారార్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లాంటి పెద్ద కళాశాలల్లో నేటికీ పాతకాలపు బ్లాక్ బోర్డ్ (నల్లబల్ల) విధానమే రాజ్యమేలుతోంది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఆధునిక సౌకర్యాలతో దూసుకుపోతుంటే ప్రభుత్వ కాలేజీలు మాత్రం ఇంకా సుద్దముక్కల ధూళిలోనే మగ్గిపోతున్నాయి. స్వయం ప్రతిపత్తి నాక్ ‘ఏ’ గ్రేడ్ ఉన్నా క్లాస్‌రూమ్‌ల రూపురేఖలు మాత్రం మారలేదు. ఎస్సారార్ కాలేజీలో 14కు పైగా కోర్సులు ఉండగా 37 తరగతి గదుల్లో విద్యాబోధన సాగుతోంది. వీటిలో కేవలం 8 మాత్రమే నామమాత్రం డిజిటల్ బోర్డులు.. మిగిలిన 29 తరగతి గదుల్లో చాక్‌పీస్‌లతోనే విద్యాబోధన సాగుతోంది.
1956లో ఏర్పాటైన ఎస్సారార్ ప్రభుత్వ కళాశాలకు ఘనమైన చరిత్ర ఉంది. ఈ కాలేజీలో చదువుకున్న ఎందరో మహానుభావులు, శాస్త్రవేత్తలు, అధికారులు దేశ విదేశాల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం కాలేజీకి యూజీసీ అటానమస్ (స్వయం ప్రతిపత్తి) హోదా, జాతీయస్థాయి గుర్తింపు అయిన నాక్ ఏ గ్రేడ్ కూడా లభించాయి. నిబంధనల ప్రకారం అటానమస్ కాలేజీలకు సొంత విద్యా ప్రమాణాలు, ఆధునిక బోధనా పద్ధతులను ఏర్పాటు చేసుకునే పూర్తి ఆర్థిక, పరిపాలనా స్వేచ్ఛ ఉంటుంది. కానీ, నిధుల కొరతనో లేక అధికారులు, పాలకుల సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఇక్కడ మెజార్టీ క్లాస్‌రూమ్‌లలో డిజిటల్ బోర్డులు అందుబాటులోకి రాలేదు. సైన్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ), కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ లాంటి ప్రాక్టికల్, గ్రాఫికల్ విజువలైజేషన్ సబ్జెక్టులను కూడా నల్లబల్లపైనే బొమ్మలు గీసి వివరించాల్సిన పరిస్థితి అధ్యాపకులకు ఎదురవుతోంది. హ్యూమన్ అనాటమీ, కెమికల్ బాండింగ్స్, ఎకనామిక్స్ గ్రాఫ్‌లు లేదా కంప్యూటర్ కోడింగ్ వంటి క్లిష్టమైన పాఠాలను డిజిటల్ బోర్డుల ద్వారా యానిమేషన్స్ రూపంలో చూపిస్తే విద్యార్థులకు సులభంగా అర్థమవుతుంది. కాగా, గంటల తరబడి థియరీ క్లాసులకే పరిమితం కావడంతో విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రాక్టికల్ పరిజ్ఞానం లోపిస్తోందని విద్యానిపుణులు పేర్కొంటున్నారు. టెక్నాలజీతో కూడిన జిజ్ఞాస పోటీల్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నామని విద్యార్థులు పేర్కొంటున్నారు.
సంప్రదాయ బోర్డుల వాడకం కేవలం బోధనా నాణ్యతనే కాకుండా విద్యార్థులు, అధ్యాపకుల ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తోంది. రోజుకు 4 నుంచి 5 గంటల పాటు సుద్దముక్కలతో బోర్డుపై రాయడం, దానిని తుడవడం వల్ల వచ్చే చాక్ డస్ట్ (సుద్ద ధూళి) ఊపిరితిత్తుల్లోకి చేరుతోంది. దీంతో చాలా మంది సీనియర్ అధ్యాపకులు దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందులు, ఆస్తమా, స్కిన్ అలర్జీల బారిన పడుతున్నారు. ముఖ్యంగా క్లాస్‌రూమ్ ముందు వరుసలో కూర్చునే విద్యార్థులు కూడా ఈ దుమ్ముతో దగ్గు, జలుబు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో అటానమస్, కార్పొరేట్ కాలేజీల్లో ‘ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్’ ద్వారా బోధిస్తున్నారు. దీంతో అక్కడి విద్యార్థులు సబ్జెక్టును త్వరగా అవగతం చేసుకుని గ్లోబల్ మార్కెట్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో సులభంగా ఉద్యోగాలు సాధించగలుగుతున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన రుసా వంటి గ్రాంట్ల ద్వారా రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ కాలేజీల్లో నామమాత్రంగా డిజిటల్ స్క్రీన్లు, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేశారు. కానీ, ఎస్సారార్ కాలేజీలో ఎలాంటి డిజిటల్ క్లాస్‌రూం ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసిన చోట సరైన ఇంటర్నెట్ కనెక్టివిటీ లేక, సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు రిపేర్ చేసే మెయింటెనెన్స్ ఫండ్స్ లేక చాలా చోట్ల మూలనపడ్డాయి. ప్రభుత్వ కాలేజీలను కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే నామమాత్రపు విద్యా కేంద్రాలుగా కాకుండా, ఆధునిక నాలెడ్జ్ హబ్‌లుగా మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మేధావులు పేర్కొంటున్నారు.
ఇన్‌చార్జిల పాలనతో ఇక్కట్లు
జిల్లాలోని 18 కాలేజీల్లో మూడు అటానమస్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 8 కాలేజీలకు మాత్రమే పూర్తిస్థాయి ప్రిన్సిపాల్స్ ఉన్నారు. 1,600 పైగా విద్యార్థులు కలిగిన ఎస్సారార్ డిగ్రీ, పీజీ కాలేజీ ఇన్‌చార్జిల పాలనలోనే కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా మహిళ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఎస్సారార్ కాలేజీ ఎఫ్‌ఏసీ హోదాలో బాధ్యతలు అప్పగించారు. వీటితో పాటు గంగాధర డిగ్రీ కాలేజీకి కూడా ఇదే ప్రిన్సిపాల్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. దాదాపు రెండేళ్లుగా ఇన్‌చార్జిల పాలనతో నడుస్తోంది. పదేళ్లలో ఎస్సారార్ కాలేజీలో చెప్పుకోతగ్గ అభివృద్ధికి నోచుకోలేదని, కరీంనగర్ ప్రభుత్వ మహిళ డిగ్రీ, పీజీ కాలేజీ అటానమస్ హోదాలో అభివృద్ధిలో దూసుకుపోతోందని పలువురు పేర్కొంటున్నారు. సదరు కాలేజీలో 35 తరగతులకు అన్నీ డిజిటల్ క్లాస్‌రూంలే ఉన్నాయి.
విద్యార్థుల డిమాండ్లు
సంప్రదాయ బ్లాక్ చాక్‌పీస్ బోర్డుల స్థానంలో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వందశాతం డిజిటల్ బోర్డులు సాధ్యం కాకపోయినా.. కనీసం నల్లబల్లలతో పాటు డిజిటల్ స్క్రీన్లను కలిపి ఉపయోగించే ‘బ్లెండెడ్ లెర్నింగ్’ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి, విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలని విద్యార్థి సంఘాలు, మేధావులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.


