సిరిసిల్ల/సిరిసిల్ల కల్చరల్: మరో తరానికి స్ఫూర్తివంతమైన సాహిత్యాన్ని అందించిన ప్రసిద్ధ కవులను ప్రేరణగా తీసుకుని ఉదీయమాన కవిత్వం వెలుగుచూడాలని ఎస్సారార్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కలువకుంట్ల రామకృష్ణ అన్నారు. జిల్లాకు చెందిన సుప్రసిద్ధ కవులు డాక్టర్ నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం సాహిత్యంపై భాషా సాంస్కృతిక శాఖ, మానేరు రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సాహిత్య సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, నిరంతర భాషాధ్యయనంతో తెలంగాణ పదకోశాన్ని రూపొందించిన భాస్కర్, ప్రపంచీకరణ నేపథ్యంలో ఉనికి కోల్పోతున్న జీవితాలపై దీర్ఘకాలంగా విశ్లేషణ చేశారని గుర్తు చేశారు. తెలంగాణ పదాలపై ఒకరు, పరిసరాలపై మరొకరు చేసిన పరిశోధనల కారణంగా స్ఫూర్తివంతమైన సాహిత్యం ఆవిర్భవించిందన్నారు. తొలిసదస్సులో నలిమెల భాస్కర్, జూకంటితో పాటు కవి, విమర్శకుడు అన్నవరం దేవేందర్, మల్లావఝల నారాయణ శర్మ, టీవీ నారాయణ పాల్గొన్నారు. మానేరు రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పత్తిపాక మోహన్ కీలకోపన్యాసం చేశారు. అనంతరం డాక్టర్ నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథంలను నిర్వాహకులు గజమాలతో ఘనంగా సత్కరించారు. అలాగే యువ కవి దూడం గణేశ్ రచించిన మాయమైన మనిషి పుస్తకాన్ని ఆవిష్కరించారు. సదస్సు కన్వీనర్ కటుకం శారద, కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, వైస్ ప్రిన్సిపాల్ లావణ్య, మారసం ప్రతినిధులు ఎలగొండ రవి, వడ్డెపెల్లి సంధ్య, బూర దేవానందం, అంకారపు రవి, ఆడెపు లక్ష్మణ్, జి. శ్రీమతి, పాకాల శంకర్, కామారపు శ్రీనివాస్, మడూరి అనిత తదితరులు పాల్గొన్నారు.
నలిమెల, జూకంటి సాహిత్య సదస్సులో వక్తలు