పెగడపల్లిలో విద్యార్థి కిడ్నాప్‌ కలకలం | - | Sakshi
Sakshi News home page

పెగడపల్లిలో విద్యార్థి కిడ్నాప్‌ కలకలం

Mar 20 2025 1:47 AM | Updated on Mar 20 2025 1:44 AM

పెగడపల్లి: పెగడపల్లి మండలకేంద్రంలో బుధవారం పట్టపగలు విద్యార్థి కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. గంట వ్యవధిలోనే పోలీసులు కిడ్నాప్‌ను ఛేదించడంతో విద్యార్థి తల్లిదండ్రులు, నందగిరి గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలోని నందగిరికి ఐలవేని రంజిత్‌కుమార్‌ మండలకేంద్రంలోని మోడల్‌ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం తన స్నేహితుడు శివరాత్రి శివతో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో వంతెన వద్ద కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వారు పయణిస్తున్న ద్విచక్రవాహనాన్ని అడ్డగించి రంజిత్‌కుమార్‌ను కారులో ఎక్కించుకుని కరీంనగర్‌ వైపు తీసుకెళ్లారు. వెంటనే తేరుకున్న శివ ఫోన్‌ద్వారా పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన ఎస్సై రవికిరణ్‌, సిబ్బంది వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌, రవీందర్‌ వెంబడించి కారుతోపాటు కిడ్నాపర్లను పట్టుకున్నారు. కరీంనగర్‌ శివారు గ్రామమైన తీగలగుట్టపల్లికి చెందిన ఆరెపల్లి అనిల్‌, నవీన్‌కుమార్‌, గసికంటి వర్ధన్‌, మైస అంజయ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నవీన్‌కుమార్‌కు చెందిన పెంపుడు కుక్కను అపహరించాడన్న అనుమానంతో రంజిత్‌కుమార్‌ను కిడ్నాప్‌ చేసినట్లు నిందితులు తెలిపారు. రంజిత్‌కుమార్‌ తండ్రి కోటయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. రంజిత్‌కుమార్‌ను పోలీసులు తల్లిదండ్రులకు సురక్షింతంగా అప్పగించారు. గంట వ్యవధిలో కిడ్నాప్‌ చేధించి బాలుడిని రక్షించిన ఎస్సై రవికిరణ్‌, సిబ్బంది వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌, రవీందర్‌ను ఎస్పీ అశోక్‌కుమార్‌, డీఎస్సీ రఘుచందర్‌, మండల ప్రజలు అభినందించారు.

గంటలోనే ఛేదించిన పోలీసులు

ఊపిరి పీల్చుకున్న బాలుడి తల్లిదండ్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement