
రథోత్సవంలో భక్తజనం
పెద్దపల్లిరూరల్: దేవునిపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు, రథోత్సవం శనివారం వైభవంగా జరిగాయి. ఏటా కార్తీక మాసంలో ఈ వేడుకలు నిర్వహిస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గతనెల 24న స్వామివారి కల్యాణం జరిపించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు స్వామివారిని దర్శించుకుని మొక్కులు సమర్పించారు.
పోటెత్తిన భక్తులు..
జిల్లాలోని అన్నిగ్రామాలతోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, పొరుగున ఉన్న మహారాష్ట్రకు చెందిన భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో స్వామివారి సన్నిధి భక్తులతో పోటెత్తింది. పెద్దపల్లి మండలం అందుగులపల్లి నుంచి దేవునిపల్లిలోని ఆలయానికి చేరుకునేందుకు దారి సరిగాలేక భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. వాహనాలను ఆలయానికి దూరంగానే నిలిపియడంతో కాలినడకన ఆలయానికి చేరుకునేందుకు అవస్థలు పడాల్సి వచ్చింది. పార్కింగ్ సమస్య తలెత్తకుండా బసంత్‌నగర్ పోలీసులు చర్యలు తీసుకున్నారు.
గుట్టపైకి కాలినడకన..
కోరమీసాల స్వామిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే గుట్టపై వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి మూలవిరాట్టును దర్శించుకునేందుకు భక్తులు కాలినడకన గుట్టపైకి ఎక్కారు. కొంతకాలం క్రితం వరకు బండరాళ్లపై పాకుతూ వెళ్లే పరిస్థితి ఉండగా.. భక్తుల సౌకర్యార్థం సమీపంలోని కేశోరాం సిమెంట్ యాజమాన్యం 418 మెట్లు నిర్మించింది. దీంతో భక్తులకు ఉపశమనం లభించింది. గుట్ట దిగువన ఉన్న ఆలయంలోనూ స్వామివారి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు బారులుతీరారు. ప్రధాన అర్చకులు శ్రీకొండపాక లక్ష్మీనర్సింహచార్యులు, శ్రీకాంతచార్యులు, రామాచార్యులు, లక్ష్మీనారాయణ తదితరులు పూజల్లో పాలుపంచుకున్నారు.
సౌకర్యాలు కల్పించాం
స్వామివారి రథోత్సవం, జాతరకు తరలివచ్చే భక్తులకు వసతులు కల్పించాం. సర్పంచ్ కిషన్ సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నాం.
– ముద్దసాని శంకరయ్య, ఆలయ ఈవో
కన్నులపండువగా దేవునిపల్లి నృసింహుని రథోత్సవం
జాతరకు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం..
ఆలయానికి చేరుకునేందుకు భక్తులకు తప్పని అవస్థలు

నృసింహుని జాతరలో భక్తుల కోలాహలం

స్వామివారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

మూలవిరాట్టు దర్శనం కోసం గుట్టపైకి వెళ్తూ..

స్వామివారికి మొక్కులు చెల్లిస్తున్న భక్తులు

ఆలయం ఎదుట కిటకిటలాడుతున్న భక్తులు