
డాక్టర్లతో మాట్లాడుతున్న కలెక్టర్ పమేలా సత్పతి
● భవిత కేంద్రాల ద్వారా ఐఈఆర్పీ సేవలు అందించాలి ● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్‌టౌన్: గర్భం దాల్చిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సంతానోత్పత్తి సమస్యలను అర్థం చేసుకోవడంపై దంపతులకు అవగాహన కల్పించాలని, ఆస్పత్రుల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ రిజిస్ట్రేషన్ నుంచి మొదలుకుని రెండో అంతస్తులో చిన్నపిల్లలకు అందిస్తున్న ఫిజియోథె రపీ కేంద్రం వరకు ప్రతీ విభాగాన్ని పరిశీలించి, అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఐన్‌క్యూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీ) ద్వారా సేవలను అందించాలని సూచించారు. తల్లిదండ్రులకు పుట్టబోయే బిడ్డ, తల్లి ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పద్ధతులపై వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా లింగనిర్ధారణ జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని, ఎవరైనా లింగనిర్ధారణకు పా ల్పడినట్లు తమదృష్టికి వచ్చినట్లయితే వారిపై చట్టరీత్యా కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రిలోని ప్రతీ విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆస్పత్రి నిర్వహణ, అందిస్తున్న వైద్యసేవలు బాగున్నాయని వైద్యాధికారులను అభినందించారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి లలితాదేవి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కృష్ణప్రసాద్, ఆర్‌ఎంవో జ్యోతి, డాక్టర్ నవీన, అలీం పాల్గొన్నారు.