కరీంనగర్ కార్పొరేషన్: మోసపూరిత మాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని మేయర్ యాదగిరి సునీల్‌రావు విమర్శించారు. గురువారం నగరంలోని 10, 31వ డివిజన్‌లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా 31 వ డివిజన్ లక్ష్మినగర్‌లో కార్పొరేటర్ లెక్కల స్వప్న వేణుతో కలిసి రూ.12 లక్షలతో చేపట్టనున్న తాగునీటి సరఫరా పైప్‌లైన్, సీసీరోడ్డు పనులకు భూమి పూజ చేశారు. 10వ డివిజన్ తిరుమలనగర్‌లో కార్పొరేటర్ కాసర్ల ఆనంద్‌తో కలిసి రూ.8లక్షలతో డ్రైనేజీ పైప్‌లైన్, సీసీరోడ్డు పనులకు భూమిపూజ చేశారు. మేయర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా సాగుతుంటే, కాంగ్రెస్, బీజేపీలకు ప్రజల సంక్షేమం అంటేనే తెలియదని అన్నారు. పాతికేళ్ల తరువాత మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ తెరపైకి తేవడం ఎన్నికల్లో లబ్ధికోసమేనని ఆరోపించారు.
దసరా తిరుగు ప్రయాణంపై 10శాతం డిస్కౌంట్
విద్యానగర్(కరీంనగర్): దసరా సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు అక్టోబర్ 15 నుంచి 30 వరకు రానుపోను ఒకేసారి టికెట్ రిజర్వేషన్ చేయించుకుంటే తిరుగు ప్రయాణంలో 10శాతం రాయితీ ఇస్తున్నట్లు కరీంనగర్ రీజియన్ మేనేజర్ ఎన్.సుచరిత తెలిపారు. రిజర్వేషన్ సౌకర్యం ఉన్న అన్ని సర్వీసుల్లో ఈ రాయితీ అవకాశం ఉంటుందని సూచించారు.
మహిళా డిగ్రీ కాలేజీలో కొత్త పీజీ కోర్సులు
కరీంనగర్‌సిటీ: కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2023–24 ఏడాదికి గానూ రెండు నూతన పీజీ కోర్సులు ప్రవేశపెట్టినట్లు ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి తెలిపారు. ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్ కోర్సులు అందుబాటులోకి తెచ్చామని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బీఎల్‌వోలకు కిట్లు
కరీంనగర్ అర్బన్: ఓటరు జాబితా రూపకల్ప న, బోగస్ ఓట్ల తొలగింపులో కీలకంగా వ్యవహరించే బూత్ లెవల్ అధికారులకు సామగ్రి చేరింది. పెన్సిల్, పెన్నులు, ఎరజర్, వైట్‌నర్, చాక్‌మర్, స్కేల్, గమ్, స్టాప్లర్, పిన్స్ ఉన్నాయి. ఓటరు జాబితా రూపొందించడంలో ఉపయోగపడే అన్ని వస్తువులను అందజేశారు. జిల్లాలో 1338 పోలింగ్ కేంద్రాలుండగా ప్రతీ కేంద్రానికి బీఎల్‌వోలున్నారు. వారందరికి కిట్లు అందజేశారు.


