అధికారులతో కలిసి సమస్యలు తెలుసుకుంటున్న మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్ కార్పొరేషన్:
‘సాక్షి ఫోన్ ఇన్’కు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి. మళ్లీ క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలిస్తా.. అని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. నగరంలో పారిశుద్ధ్యం పరిస్థితి...పెరుగుతున్న దోమలు...జ్వరాల తీవ్రత...నేపథ్యంలో గురువారం ‘సాక్షి’ మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగర ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దోమల నియంత్రణకు ఫాగింగ్, స్ప్రే చేయడం లేదని, చెత్త తీసుకుపోవడానికి సిబ్బంది ఇబ్బందులు సృష్టిస్తున్నారని, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ ఖాళీని భర్తీ చేయాలని, ఖాళీ స్థలాల్లో వర్షపునీళ్లు, డ్రైనేజీ నీళ్లు నిలుస్తున్నాయని తదితర సమస్యలు నగరవాసులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా నోట్ చేసుకొన్న కమిషనర్ సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఖాళీ స్థలాల్లో డ్రైనేజీ, వర్షపు నీళ్లు నిలవ ఉండకుండా ఉండేందుకు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఖాళీ స్థలాలను వెంటనే గుర్తించి జాబితా ఇవ్వాలన్నారు. సంబంధిత యజమానులకు నోటీసులు ఇచ్చి క్లియర్ చేయాలన్నారు. చెట్లు, చెట్టు కొమ్మలను కొట్టి రోడ్లపై ఉంచరాదని, ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా తొలగించాలని సూచించారు. చెత్త సేకరించే ట్రాక్టర్ డ్రైవర్‌లు డబ్బులు డిమాండ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు ఫాగింగ్, స్ప్రే చేయని ప్రాంతాల్లో వెంటనే ఫాగింగ్ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, శానిటరీ సూపర్‌వైజర్ రాజమనోహర్, డీసీపీ సుభాష్, ఈఈ మహేందర్ పాల్గొన్నారు.
హౌసింగ్‌బోర్డు కాలనీలో డ్రైనేజీలో చెత్త పడవేస్తున్నారు. మురికినీళ్లు నిలిచిపోతున్నాయి.వాటర్ ట్యాంక్ వద్ద శానిటేషన్ సరిగా లేక దోమలు పెరుగుతున్నాయి. స్మార్ట్ సిటీలో భాగంగా మొక్కలు నాటడం లేదు.
– సాగర్, శివ, నరేందర్‌రెడ్డి, హౌసింగ్ బోర్డుకాలనీ
కమిషనర్: డ్రైనేజీలో చెత్త వేస్తున్నట్లు దృష్టికి వచ్చింది. చెత్త పడవేయకుండా అక్కడ సిబ్బందిని పెడుతాం. స్మార్ట్ సిటీలో భాగంగా మొక్కలు నాటుతాం.
భవాని నగర్ రోడ్ నెంబర్ 2లో డ్రైనేజీ సరిగాలేక దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇండ్ల పక్కనే రోడ్లపై చెట్లు ప్రమాదకరంగా మారాయి.
– అమరేందర్ సింగ్,భవాని నగర్
కమిషనర్: ఇంటినెంబర్ నోట్ చేసుకున్నాం. పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటాం.
చెత్త తీసుకుపోవడానికి ట్రాక్టర్ సక్రమంగా రావడంలేదు. చెత్త నిండింది తర్వాత వస్తామని చెబుతూ దాటవేస్తున్నారు. డబ్బులు అడుగుతున్నారు. మహిళలపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు.
– శ్రీలక్ష్మి, జయశ్రీ, మంకమ్మతోట
కమిషనర్: తప్పకుండా చెత్త తీసుకెళ్లే విధంగా చూస్తాం. విచారణచేపట్టి చర్యలు తీసుకుంటాం.
వివేకానందపురి కాలనీలో చెట్లు, కొమ్మలుకొట్టి రోడ్డుపై పడేసి రోజులు గడుస్తున్నాయి. వినాయక చవితి నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. డీమార్ట్ ఏసీసీ ఆఫీసు వద్ద డ్రైనేజీలో చెత్త కారణంగా మురికినీళ్లు నిలుస్తున్నాయి.
– బేతి మహేందర్ రెడ్డి, రాహుల్ రెడ్డి, వివేకానందపురికాలనీ
కమిషనర్ : వెంటనే క్లియర్ చేస్తాం.
మంకమ్మతోటలో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.
– మడపతి రమాపతిరావు,మంకమ్మతోట
కమిషనర్: పరిశీలించి పరిష్కరిస్తాం
9వ డివిజన్ పోచమ్మదేవాలయం సమీపంలో డ్రైనేజీ పనులు అర్ధాంతరంగా వదిలేయడంతో మురికి నీరు నిలిచి, దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. విద్యాగనర్ మహాశక్తి ఆలయం సమీపంలోని అపార్ట్‌మెంట్ వద్ద డ్రైనేజీ కూలిపోయి దోమలు పెరిగి రోగాల బారిన పడుతున్నాం.
– కె.అనంతరాణి, పోచమ్మవాడ. మాధవరెడ్డి, విద్యానగర్
కమిషనర్: ఇంజినీరింగ్ అధికారిని పంపించి సమస్యను పరిష్కరిస్తాం.
8వ డివిజన్ అలుగునూరులో డ్రైనేజీ లేక మోరీ నీళ్లు ఇండ్ల వద్ద నిలుస్తున్నాయి.
– వసీం, అలుగునూరు
కమిషనర్: పరిష్కరిస్తాం.
కట్టరాంపూర్‌లోని తులసినగర్, విద్యానగర్, పోచమ్మవాడల్లోని ఖాళీ స్థలాల్లో చెత్తవేస్తున్నారు.కుక్కల బెడద తీవ్రంగా ఉంది.
– పి.సతీశ్, కట్టరాంపూర్, సాజిద్, కిసాన్‌నగర్, చిరదీప్, పోచమ్మవాడ, సమ్మిరెడ్డి, విద్యానగర్.
కమిషనర్: చెత్తను పూర్తిగా తొలగిస్తాం. కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం.
డాక్టర్స్ స్ట్రీట్‌లో రోడ్లమీద అంబులెన్స్‌లు పార్కింగ్ చేస్తుండడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మెడివేస్టేజ్ కూడా రోడ్లపైనే వేస్తున్నారు.
– సహజ, డాక్టర్స్ స్ట్రీట్
కమిషనర్: సమస్యను పరిష్కరిస్తాం
దోమల నియంత్రణకు ఫాగింగ్ చేయడం లేదు. ఇంటింటికీ స్ప్రే కూడా చేయడం లేదు. ప్రకటనలకే పరిమితమవుతున్నారు.
– కృష్ణ, జ్యోతినగర్, రాజు, మంకమ్మతోట
కమిషనర్: ఇప్పటికే ఫాగింగ్ చేస్తున్నాం. రాని ప్రాంతాల్లో వెంటనే ఫాగింగ్ చేపడుతాం.
నగరపాలకసంస్థకు హెల్త్ సూపర్‌వైజర్ లేకపోవడంతో సేవలు అందడం లేదు.
– షాబొద్దీన్, ఖాన్‌పుర
కమిషనర్: ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం.
పార్క్ స్థలాన్ని కబ్జా నుంచి కాపాడండి.
– రాధిక, మార్కండేయనగర్
కమిషనర్: చర్యలు తీసుకుంటాం.
మదీనా కాంప్లెక్స్‌లో సులభ్ కాంప్లెక్స్ నిర్వహణ లోపంతో ఆ ప్రాంతంలో వాసన భరించలేకపోతున్నాం. చర్యలు తీసుకోవాలి.
– అబ్దుల్ రెహమాన్
కమిషనర్: కొత్త టాయిలెట్స్ నిర్మిస్తాం.
చెత్తను సేకరించే ట్రాక్టర్లు, ఆటోలకు ట్రాక్ సిస్టమ్ పెడితే సేవలు మరింత మెరుగవుతాయి.
– మహ్మద్ అమీర్, అంబేడ్కర్‌నగర్
కమిషనర్: తప్పకుండా ట్రాక్ సిస్టమ్‌ను అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తాం.
టూటౌన్ పోలీసు స్టేషన్ పక్కనున్న డ్రైనేజీ కూలిపోయి, చెట్లు,పొదలు పెరిగి డ్రైనేజీ నీళ్లు ఇండ్లల్లోకి వస్తున్నాయి.
– చెట్ల రాజేశ్వర్,ముకరంపుర
కమిషనర్: సమస్యను పరిష్కరించేలా చూస్తాం.
క్షేత్రస్థాయిలో మళ్లీ పరిశీలిస్తా
బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
‘సాక్షి ఫోన్ ఇన్’కు విశేష స్పందన
ఫిర్యాదులపై సత్వర ఆదేశాలు
హాజరైన అన్ని విభాగాల అధికారులు


