Korutla Deepthi Case: కోరుట్ల దీప్తి కేసు.. వెలుగులోకి అసలు నిజాలు?

Korutla Software Engineer Deepthi Sister Chandana Arrest - Sakshi

కోరుట్ల: సంచలనం రేపిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బంక దీప్తి(24) అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటనలో నిందితులుగా భావిస్తున్న బంక చందన(21), ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పరిసరాల్లో తలదాచుకున్న వీరిద్దరినీ పోలీసులు పట్టుకుని కోరుట్లకు తరలిస్తున్నట్లు తెలిసింది.

మూడు రోజులుగా గాలింపు..!
పట్టణానికి చెందిన బంక దీప్తి మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విదితమే.

అప్పటినుంచి ఆమె చెల్లెలు చందన పరారీలో ఉండటం కలకలం రేపిన క్రమంలో పోలీసులు ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్నారు.

అక్క దీప్తి చనిపోవడంలో తన ప్రమేయం లేదని చందన తన తమ్ముడు సాయికి వాయిస్‌ మేసేజ్‌ పంపిన క్రమంలో ఆమె సెల్‌ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

బుధ, గురువారాల్లో మెట్‌పల్లి డీఎస్పీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రెండు పోలీసు బృందాలు చందన ఆచూకీ కోసం హైదరాబాద్‌లో గాలించాయి.

అక్కడ నుంచి చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ మకాం మార్చినట్లు గుర్తించినట్లు తెలిసింది. చందనతోపాటు ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు పాస్‌పోర్ట్‌లు ఉండటం వారు రూ.2 లక్షల నగదు, సుమారు రూ.90 లక్షల విలువైన బంగారం ఇంటి నుంచి తీసుకెళ్లారని తండ్రి శ్రీనివాస్‌రెడ్డి చేసిన ఫిర్యాదుతో ఆ డబ్బుతో వారిద్దరూ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు లుక్‌ అవుట్‌ నోటిసులు జారీచేశారు.

హైదరాబాద్‌– బెంగళూర్‌ మార్గంలో.. ఆంధ్రాలో
బంక చందన బంధువులు ఒంగోలు జిల్లాకు చెందిన వారు కావడంతో ఆంధ్రప్రదేశ్‌కు ఆమె వెళ్లి ఉంటుందని భావించిన పోలీసులు ఆ దిశలో గాలింపు చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూర్‌ మార్గంలో అనంతపురం, ప్రకాశం జిల్లా పరిసరాల్లో చందన ఆమె బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నట్లు గురువారం రాత్రి పోలీ సులు గుర్తించారు. శుక్రవారం తెల్లవారుజామున చందన ఆంధ్రాలోని ప్రకాశం జిల్లా పరిసరాల్లో ఉన్నట్లుగా గుర్తించి పకడ్బందీ ప్రణాళికతో అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

శుక్రవారం రాత్రి వారిద్దరినీ కోరుట్లకు తీసుకువచ్చినట్లుగా తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్‌లు వాస్తవాలు వెల్లడిస్తే దీప్తి అనుమానాస్పద మృతి వెనుక అసలు నిజాలు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం విచారణ చేయనున్నట్లు సమాచారం.

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top