అటకెక్కిన పంటల బీమా | - | Sakshi
Sakshi News home page

అటకెక్కిన పంటల బీమా

Feb 27 2026 4:17 AM | Updated on Feb 27 2026 4:17 AM

అటకెక్కిన పంటల బీమా

అటకెక్కిన పంటల బీమా

● ఆదుకునే దిక్కు లేక రైతుల ఆవేదన ● రెండేళ్లు గడిచినా రాని కొత్త బీమా పథకాలు ● తీవ్రంగా నష్టపోతున్న అన్నదాత

జగిత్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో ఏటా ప్రకృతి వైపరీత్యాలతో పంటల నష్టం జరుగుతోంది. దీంతో పంటకు పెట్టిన పెట్టుబడులు రాక, బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు రైతులకు గుదిబండగా మారుతున్నాయి. ప్రభుత్వాలకు పంట నష్టపరిహారం ఇవ్వడం చేతకానప్పుడు కనీసం రైతులకు ఆమోదయోగ్యమైన పంటల బీమా పథకాలు అమలు చేయాలని రైతులు కోరుతున్నప్పటికీ ఇప్పటికీ అతీగతీ లేవు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినప్పటికీ ఎటువంటి బీమా పథకాలు అమలు చేయకపోవడంతో పంట నష్టం జరిగినప్పుడు రైతుల రోదనలు అరణ్యరోదనలుగానే మారుతున్నాయి.

అమలు కాని బీమా పథకాలు

రైతులు వేసిన పంటలకు నష్టం జరిగినప్పుడు పరిహారం ఇచ్చి ఆదుకునేందుకు గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రెండు పంటల బీమా పథకాలు అమలు అయ్యేవి. మొదటిది పంటల బీమా పథకం(ఫసల్‌ భీమా యోజన), రెండోది వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం. ఈ పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఇన్సూరెన్సు ప్రీమియం చెల్లిస్తుండగా, మరికొంత రైతులు చెల్లించేవారు. ఈ పథకాలను ప్రభుత్వాలు ప్రవేశపెట్టినప్పటికీ సరైన నిబంధనలు అమలు చేయకపోవడంతో రైతుల అభిమానాన్ని చూరగొనలేకపోయాయి.

పంటల బీమా పథకం రద్దు

పంటల బీమా పథకంలో భాగంగా పంట రుణం తీసుకున్న రైతుల నుంచి బ్యాంకులు ప్రిమియం వసూలు చేసి ఇన్సూరెన్సు సంస్థలకు చెల్లించేవి. కాని, పంట నష్టం జరిగినప్పటికీ రైతులకు పరిహారం చెల్లించడంలో ఇన్సూరెన్సు సంస్థలు మీన వేషాలు వేశాయి. దీనికి తోడు, పంట నష్టపోయిన రైతును యూనిట్‌గా కాకుండా, కొన్ని పంటలకు గ్రామాన్ని, మరికొన్ని పంటలకు మండలాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో ఏ ఒక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం రాలేదు. ఈ పథకంలో పలు లోపాలున్నాయంటూ గతంలోని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.

వాతావరణాధారిత బీమా

అధిక ఉష్ణోగ్రతలు, వడగళ్లు, బలమైన ఈదురుగాలులు వంటి వాతావరణ మార్పులతో మామిడి, మిర్చి, పత్తి వంటి పంటలు నష్టపోతే, ఆయా పంటలకు నష్టపరిహారం వచ్చేలా ప్రభుత్వం వాతావరణ ఆధారిత పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో రైతులు చేరినప్పటికీ పంట నష్టం జరిగినప్పుడు పలు నిబంధనలంటూ ఇన్సూరెన్సు సంస్థలు పరిహారం ఇచ్చేందుకు వెనుకంజ వేశాయి. ఇందుకోసం ప్రతీ మండలంలో ఏర్పాటు చేసిన వాతావరణ కేంద్రాలు ఇచ్చే సమాచారాన్నే ప్రమాణికంగా తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో పంట నష్టం జరిగినప్పటికి వాతావరణ కేంద్రం నుండి సరైన సమాచారం పోకపోవడంతో పరిహారం ఇచ్చేందుకు ఇన్సూరెన్సు సంస్థలు నిరాకరించాయి. దీనిపై రైతులు ఆందోళనలు చేశారు. దీంతో ఈ పథకాన్ని సైతం ప్రభుత్వం రద్దు చేసింది.

ఊరిస్తున్న పంటల బీమా పథకం

ఇప్పటి వరకు ఉన్న బీమా పథకాలు రైతులకు న్యాయం చేయలేకపోయాయని, రాబోయే రోజుల్లో రైతులందరికీ అమోదయోగ్యమైన పంటల బీమా పథకాన్ని తీసుకవస్తామని ప్రభుత్వ పెద్దలు హామీలు గుప్పిస్తున్నా ఇప్పటికీ అతీగతీ లేదు. గ్రామాన్ని యూనిట్‌గా కాకుండా రైతును యూనిట్‌గా తీసుకుంటామని, పంటకు నష్టం జరిగినప్పుడు ఇన్సూరెన్సు సంస్థ పరిహారం అందించేలా చూస్తామని చెబుతున్నారు. అలాగే, ఇన్సూరెన్సు సంస్థకు చెల్లించే ప్రీమియాన్ని సైతం రైతులపై భారం పడకుండా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలుపుతున్నారు. అయితే, ఆ పథకాలు ఎప్పుడు అమలవుతాయో కాని, ఇప్పుడైతే నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement