బ్రహ్మోత్సవాలకు వేళాయె..
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి మార్చి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గతేడాది కంటే ఈసారి స్వామివారి ఉత్సవాలను మహా వైభవంగా జరిపించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్‌ల ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు వారి వారి పనులను ముమ్మరం చేశారు. చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, బోధన్, నిజామాబాద్, నిర్మల్, ఆర్మూర్ జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆర్చీలు, వేసవి సందర్భంగా చలివేంద్రాలు, ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు. గోదావరి నదిలోని పుష్కరఘాట్ల వద్ద భక్తులకు సరిపడా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
దాతల సహకారంతో అన్నదానం
బ్రహ్మోత్సవాలకు వచ్చే వేలాది మందికి అన్నదానం కోసం రైసుమిల్లర్లు, ఆర్యవైశ్యులు, వర్తక సంఘం, ఇతర దాతల సహకారంతో ఉచిత అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
400మంది పోలీసులతో బందోబస్తు
జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 400 మంది పోలీస్‌లతో బందోబస్తు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు.
బ్రహ్మోత్సవాలకు వేళాయె..


