బీమా లేక.. ధీమా కరువై.. | - | Sakshi
Sakshi News home page

బీమా లేక.. ధీమా కరువై..

Nov 20 2026 1:43 AM | Updated on Nov 20 2026 1:43 AM

బీమా లేక.. ధీమా కరువై.. ప్రభుత్వ నిర్ణయంపైనే ఆశలు

రూ.5 లక్షలతో ఎంతో ఆసరా

నిలిచిన రైతు బీమా

ఒకవైపు కుటుంబ పెద్దను కోల్పోయిన పుట్టెడు దుఃఖం.. మరోవైపు రైతుబీమా సాయం అందకపోవడంతో బాధిత కుటుంబాల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని మృతుల కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

అనుకోని పరిస్థితుల్లో ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలకు రైతుబీమా ధీమాగా ఉండేది. కారణం ఏదైనా చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సొమ్ము నామినీ ఖాతాలో జమయ్యేది. చనిపోయిన కొన్ని రోజులకే బీమా సొమ్ము అందేది. కానీ, రైతు బీమా గడువు ఈ ఏడాది ఆగస్టు 14తో ముగిసింది. ప్రభుత్వం రెన్యూవల్‌ చేయకపోవడంతో ఆ తర్వాత చనిపోయిన రైతుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. గడిచిన మూడు నెలల కాలంలో జిల్లాలో 279 మంది రైతులు చనిపోయినట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో రైతుబీమాకు అర్హత ఉన్న 1,98,159 మంది రైతులకు సంబంధించి ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో చనిపోయిన కుటుంబాలకు బీమా సొమ్ము రావడం లేదు. అయితే చనిపోయిన రైతుల వివరాలను వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తోంది. ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ బీమాను అమలులోకి తీసుకువస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు చనిపోయిన రైతుల కుటుంబాల పరిస్థితి ఏమిటన్నది తేలడం లేదు.

చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకునే విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా కుటుంబ బీమా పథకాన్ని తీసుకువస్తున్నా, ఇప్పటి వరకు చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకునే విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.

ఏదేని కారణంతో చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబీమా పేరిట చేపట్టిన పథకం ఎన్నో కుటుంబాలకు ఆసరా అయ్యింది. రూ. 5 లక్షలు కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. 18 – 59 ఏళ్లలోపు వయసు ఉన్న రైతులందరికీ రైతుబీమా అమలు చేశారు. బీమాకు ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేది. ఏటా రెన్యూవల్‌ చేస్తూ, చనిపోయిన కుటుంబాలకు సకాలంలో బీమా సొమ్ము అందేలా యంత్రాంగం చూసేది. వ్యవసాయ విస్తీర్ణాధికారులు చనిపోయిన రైతుల ఇంటికి వెళ్లి వారి వివరాలు తీసుకొని ఆన్‌లైన్‌లో నమోదు చేసేవారు. నామినీ బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షలు జమ అయ్యేవి. దీంతో ఆ డబ్బులు రైతుల కుటుంబాలకు ఎంతో ఆసరా అయ్యేది.

చనిపోయిన రైతుల కుటుంబాలు బీమా సొమ్ము విషయంలో ఆందోళన చెందుతున్నాయి. రూ.5 లక్షలు వస్తాయని ఆశతో ఉన్న ఆ కుటుంబాలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. రైతుబీమాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అప్పులు తీర్చడానికి, పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాలకు వాడుకుందామనే ఆశతో ఉన్న కుటుంబాలు బీమా సొమ్ము రాకపోవడంతో ఆందోళన చెందుతున్నాయి. బీమా ప్రీమియం సకాలంలో చెల్లి్‌ంచి రెన్యూవల్‌ చేస్తేనే బీమా సొమ్ము వస్తుంది. కానీ ప్రభుత్వం కాలపరిమితి ముగిసినా ప్రీమియం చెల్లించకపోవడంతో ఇన్సూరెన్స్‌ సొమ్ము వచ్చే అవకాశం లేదు.

మూడు నెలల్లో జిల్లాలో

279 మంది అన్నదాతల మృతి

ప్రభుత్వం ఆదుకోవాలని

బాధిత కుటుంబాల వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement