కమ్మర్‌పల్లి(భీమ్‌గల్) : భీమ్‌గల్ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నింబాచల క్షేత్రంపై కొలువుదీరిన లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని గురువారం కనుల పండువగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన కల్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఉదయం 9.30 గంటలకు గర్భాలయంలో ప్రధాన యాగ్నికుల ఆధ్వర్యంలో స్వామివారి మూలవిరాట్టుకు శాస్త్రోక్తంగా కల్యాణ క్రతువు నిర్వహించారు. ప్రతి ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ కల్యాణ మహోత్సవంలోని ఆధ్యాత్మిక అంతరార్థాన్ని అర్చకులు వివరించారు. కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు అర్చకులు ప్రసాద అక్షింతలు అందించి ఆశీర్వదించారు. రాత్రి వివాహ స్థాలీపాక హోమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
గోవింద నామస్మరణతో
మార్మోగిన లింబాద్రిగుట్ట
భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం
వైభవంగా కొనసాగుతున్న
బ్రహ్మోత్సవాలు


