లక్షా 35 వేల జాబ్‌కార్డులు
పాడి రైతులకు లబ్ధి
దరఖాస్తు చేసుకోవాలి
ఎల్లారెడ్డిరూరల్: ఎల్‌నినో ప్రభావంతో పశువుల మేతకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీబీ జీ రాంజీ పథకం ద్వారా రైతులు పశుగ్రాసం పెంచేలా ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా పశువులతోపాటు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఎకరానికి రూ.14 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నది.
అధికారుల ధ్రువీకరణ తర్వాతే..
పశుగ్రాసం పెంపకానికి దరఖాస్తు చేసుకునే రైతులకు తప్పనిసరిగా పశువులు ఉండాల్సిందే. దరఖాస్తు సమయంలో పట్టాపాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటితోపాటు రైతులు పశువైద్యాధికారితో పశువులు ఉన్నట్లు ధ్రువీకరించుకోవాలి. అనంతరం ఉపాధి హామీ అధికారులకు జాబ్ కార్డు వివరాలతో దరఖాస్తు అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో పశువైద్యాధికారులు సూచించిన సూపర్ నేపియర్, పచ్చి మొక్కజొన్న గడ్డిరకం, గినియా, లూనేస్, స్టెలో, గినియా, బఫేల్ వంటి మంచి రకం గడ్డిని సాగు చేయాల్సి ఉంటుంది. దీంతో అటు పశువులకు బలవర్ధకమైన గడ్డి, ఇటు అధికంగా పాల దిగుబడి లభించనున్నది. ఇదే కాకుండా ప్రతి గ్రామంలో పశువుల తొట్ల నిర్మాణానికి సైతం రూ.34 వేలు జీపీలకు అందించనున్నారు.
జిల్లాలో వీబీ జీ రాంజీ పథకంలో ఉపాధి పనులు చేసే కుటుంబాలకు సంబంధించి లక్షా 35 వేల 912 జాబ్ కార్డులు యాక్టివ్ మోడ్‌లో ఉన్నాయి. వీటి పరిధిలో 2,15,329 మంది ఉపాధి కూలీలు పనులు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా వేసవిలో పశుగ్రాసం సాగు చేసేందుకు ఎకరానికి రూ.14,023 అందించనుండగా, ఇప్పటి వరకు జిల్లాలో 120 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. అత్యధికంగా ఎల్లారెడ్డి మండలంలో 34 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
రైతులు పశుగ్రాసం సాగుకు దరఖాస్తులు చేసుకోవాలి. సంబంధిత పత్రాలు అందిస్తే మేము ధ్రువీకరించి వీబీ జీ రాంజీ అధికారులకు పంపిస్తాం. ఈ పథకం ద్వారా పాడి రైతులకు లబ్ధి చేకూరుతుంది.
– అర్చన, వెటర్నరీ డాక్టర్, వెల్లుట్ల
ఎల్లారెడ్డి మండలంలో పశుగ్రాసం సాగుకు 34 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. పశువులతోపాటు భూమి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. ఎంత మంది రైతులైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
– వినోద్, ఏపీవో, ఎల్లారెడ్డి
వీబీ జీ రాంజీ ద్వారా ఆర్థిక సహాయం
ఎకరానికి రూ.14 వేలు
అందజేయనున్న సర్కారు
జిల్లాలో ఇప్పటి వరకు
120 మంది రైతుల దరఖాస్తు


